గత కొన్ని రోజులుగా తెలంగాణ బిజేపి అధ్యక్షుడు మార్పుపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బిజేపి అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ తో కొందరు నేతలకు పడటం లేదని, ఆయన అందరినీ కలుపుని వెళ్ళడం లేదని, దీంతో పార్టీ వెనుకబడిందని చెప్పి..కొందరు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారని, దీంతో బిజేపి అధ్యక్షుడుని మారుస్తున్నారనే ప్రచారం వచ్చింది.
ముఖ్యంగా బండితో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు పొసగడం లేదని, అందుకే వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, ఇటీవల ఢిల్లీకి వెళ్ళి బండిని మార్చాలని ఫిర్యాదు చేసినట్లు కథనాలు ఇచ్చాయి. ఇదే క్రమంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందని, ఈ విస్తరణలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని..తెలంగాణ అధ్యక్షుడుగా చేసి..బండిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం ముమ్మరం అయింది. రేపో మాపో ప్రకటన కూడా వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు.
కానీ ఇదంతా కేవలం ప్రచారమే అని తెలుస్తుంది. అధ్యక్షుడు బండి సంజయ్ కొనసాగనున్నారు. ఈ విషయాన్ని మరొకసారి తెలంగాణ బిజేపి వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడుని మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, తెలుగు న్యూస్ చానల్స్ లోనే కథనాలు వస్తున్నాయని, వాటిలో వాస్తవం లేదని తరుణ్ చెప్పుకొచ్చారు. బండి సంజయ్ అధ్యక్షుడుగా కొనసాగుతారని అన్నారు.
అయితే ఎన్నికల షెడ్యూల్ మరో నాలుగు నెలల్లో వచ్చేస్తుంది. ఈ లోపు అధ్యక్షుడుని మార్చడం వల్ల ఉపయోగం ఉండదు. మళ్ళీ కొత్త అధ్యక్షుడుతో ఇబ్బందులు. అసలు బండి అధ్యక్షుడు అయ్యాకే తెలంగాణలో బిజేపికి దూకుడు పెరిగింది..కాబట్టి ఎన్నికల వరకు ఆయన్నే అధ్యక్షుడుగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.