హస్తం సవారీ..ఇలా కలిసొస్తున్నాయి ఏంటి?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇటీవల సానుకూల అంశాలు ఎక్కువగా నడుస్తున్నాయి. అన్నీ మంచి శుభ శకునములే అన్నట్లుగా..కాంగ్రెస్‌కు అన్నీ అంశాలు కలిసొస్తున్నాయి. ఇప్పటికే మేనిఫెస్టోలోని కొన్ని కీలక హామీలని ప్రకటించి ప్రజలని ఆకర్షించే దిశగా వెళుతున్నారు. ఇక కాంగ్రెస్ లోకి వలసలు అనేవి బాగా ఊపు తెస్తున్నాయి. పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అది కూడా కాస్త ప్రజా బలం ఉన్న నేతలే కాంగ్రెస్ లోకి వస్తున్నారు.

దీంతో ఆ పార్టీకి కొత్త జోష్ నెలకొంది. ఇటు రాష్ట్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటనలు పార్టీకి ఊపు తెస్తున్నాయి. ఇదే సమయంలో మొన్నటివరకు ఒకరంటే ఒకరికి పడని సీనియర్ నేతలు ఇప్పుడు ఏకమయ్యారు. కలిసికట్టుగా పార్టీని గెలిపించాలని డిసైడ్ అయ్యారు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిలో సీనియర్లు అంతా కలిశారు.  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సంపత్‌కుమార్‌, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, జూపల్లి కృష్ణారావు, కోదండరెడ్డి ఇలా కీలక నేతలంతా కలిశారు.

ఇక వీరంతా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళి పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా వలసలని కూడా ప్రోత్సహించనున్నారు. అలాగే ఈ నెల 30న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ జరగనుంది. ఇలా అన్నీ వైపులా కాంగ్రెస్‌కు పాజిటివ్ అంశాలు ఉన్నాయి. కాకపోతే వలసల వల్ల ఆధిపత్య పోరు పెరిగే అవకాశాలు ఉన్నాయి..దీని వల్ల పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ కూడా ఉంది.

కాబట్టి వలసల విషయంలో ఆచి తూచి ముందుకెళ్లాలి. అలాగే రాష్ట్రంలో ఇప్పటికీ బి‌ఆర్‌ఎస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. ఆ ఆధిక్యాన్ని తగ్గించడానికి ఇంకా కష్టపడాలి. అప్పుడే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెరుగు పడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version