భారీ వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. వరద ఉద్ధృతి.. ప్రమాదాలు.. కొండచరియలు విరిగిపడి.. ఇలా వర్షాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం చెందారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఖలాపుర్ మండలంలోని ఇర్షాల్‌వాడి జరిగిన ఈ ప్రమాదంలో.. దాదాపు 21 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. శిథిలాల కింద సుమారు దాదాపు 17 కుటుంబాలకు చెందిన 100 మంది దాకా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సమాచారం అందుకున్న రెస్యూ బృందాలు.. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని నవీ ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. ఘటనాస్థలాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే సందర్శించారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నాయని ట్వీట్ చేశారు.