తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే ఓటు షేరింగ్ పెంచుకున్న బీభారతీయ జనతాపార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెచ్చుకున్న ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపిస్తూ అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. లోపాలను అధిగమించి 17 ఎంపీ స్థానాలకు గాను 10 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుని క్షేత్రస్థాయిలో కార్యాచరణ మొదలు పెట్టింది. ఉత్తర తెలంగాణాలో ఆ పార్టీకి సానుకూల ఫలితాలు రావడం కొంత ఊరట కలిగిస్తోంది.దీంతో మరింత దూకుడును ప్రదర్శించేందుకు సిద్ధమైంది బీజేపీ హైకమాండ్. త్రలోనే అభ్యర్ధులను ప్రకటించి ముందస్తుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఓటర్లను నేరుగా కలిసేందుకు బీజేపీ నేతలు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడమే లక్ష్యంగా వారు ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 4 సీట్లను గెలుచుకుంది భారతీయ జనతాపార్టీ.ఈ సంఖ్యను ఈ సారి 10కి పెంచాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన కేంద్రహోంమంత్రి అమిత్ షా పార్టీ నేతలతో సమావేశమై అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ వేదికగా అమిత్ షా నాయకత్వంలో జరిగిన పార్లమెంట్ ప్రిపరేషన్ మీటింగ్ లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలంటే ప్రతి సీటు కూడా సీరియస్ గా తీసుకోవాలని కేడర్‌కు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను క్యాడర్ తో చర్చించారు. దశలవారీగా ప్రచార కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని.. ప్రతి ఓటరును చేరుకునేలా పార్టీ అనుబంధ విభాగాలను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు.
అత్యధిక స్థానాలను గెలవాలంటే జనాదరణ కలిగిన నేతలను అభ్యర్ధులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.అంతేకాదు పార్టీ పట్ల విధేయతను,ఆర్థిక స్థితిని కూడా అధిష్టానం లెక్కలోకి తీసుకోవాలి.ఈ నేపథ్యంలో 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సీరియస్‌గా దృష్టి సారించింది.టికెట్ ఆశిస్తున్నవారు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిలోని బలాబలాలను అంచనా వేస్తున్నారు అమిత్‌షా.ఒత్తిళ్లకు తలొగ్గకుండా సర్వేల ఆధారంగా బలమైన అభ్యర్థులను గుర్తించేపనిలో పడ్డారు.ఇదే క్రమంలో ఈ నెల 7,8తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలో సంస్థాగత మార్పుల నేపథ్యంలో ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక పై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం కేంద్రం నుంచి పార్టీ పరిశీలకులు కూడా విచ్చేయనున్నారు. మొత్తానికి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న బీజేపీ..,దక్షిణ భారతదేశంలో సీట్లను పెంచుకునే పనిలో నిమగ్నమైంది.