వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు ఉంటుందో లేదో క్లారిటీ రావడం లేదు. ఒకోసారి ఏమో రెండు పార్టీల మధ్య పొత్తు సెట్ అయిపోతుందన్నట్లే రాజకీయం ఉంటుంది…ఇంకోసారి ఏమో పొత్తు ఉండట్లేదు అనేలా రాజకీయం నడుస్తుంది. తాజా పరిస్తితులని చూస్తుంటే రెండు పార్టీల మధ్య పొత్తు కష్టమే పరిస్తితి కనిపిస్తుంది. ఇటీవల పవన్ దూకుడుగా ఉంటూ..టిడిపి బలంగా ఉన్న స్థానాల్లో కూడా వారాహి యాత్ర చేశారు. అలాగే ఇంచార్జ్ లని ప్రకటించారు. ఇక కొన్ని చోట్ల జనసేన నేతలు టిడిపి శ్రేణులని పార్టీలోకి తీసుకుంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా టిడిపి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఇటీవల పవన్ ..జనసేన ఇంచార్జ్ ప్రకటించిన సీటులోనే టిడిపి ఇంచార్జ్‌ని పెట్టింది. వాస్తవానికి అన్నీ సీట్లలో టిడిపి ఇంచార్జ్‌లు ఉన్నారు. కాకపోతే జనసేనతో పొత్తు ఊహించుకుని కొన్ని చోట్ల చంద్రబాబు కో ఆర్డినేటర్లని పెట్టారు..అలాగే కొన్ని చోట్ల డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు. కానీ పవన్ టిడిపి గురించి ఆలోచించకుండా..ముందుకెళ్లిపోతున్నారు.
దీంతో టిడిపి సైతం దూకుడు పెంచింది. ఇటీవల పవన్..రాజానగరం ఇంచార్జ్ బత్తుల రామకృష్ణని నియమించిన విషయం తెలిసిందే. అక్కడ టిడిపికి ఇంచార్జ్ లేరు. అంతకముందు ఉన్న ఇంచార్జ్ పెందుర్తి వెంకటేష్ రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు..రాజానగరం ఇంచార్జ్ గా బొడ్డు వెంకటరమణని నియమించారు.
ఇక మాజీ ఎమ్మెల్యే వెంకటేష్‌కు అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇలా టిడిపి ఇంచార్జ్‌ని పెట్టడంతో రాజానగరం సీటుల ట్విస్ట్ వచ్చింది. పొత్తు ఉంటే ఈ సీటు టిడిపికి దక్కుతుందా? లేక జనసేనకు దక్కుతుందా? అనేది క్లారిటీ లేకుండా పోయింది. పొత్తు లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. టిడిపి-వైసీపీ-జనసేన మూడు పార్టీలు పోటీ చేస్తాయి.