దశాబ్దాల పాటు తెలంగాణలో ఒక వెలుగు వెలుగిన తెలుగుదేశం పార్టీ..ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యే స్థితికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ పార్టీ కథ తెలంగాణలో దాదాపు ముగిసిపోయింది. అయితే ఆ పార్టీకి చెందిన బలమైన నేతలు ఎక్కువగా టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. అలాగే మరికొందరు కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. అయితే ఇతర పార్టీల్లో ఉన్న మాజీ టీడీపీ నేతలని తమవైపుకు తిప్పుకునేందుకు కొత్తగా పీసీసీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్న రేవంత్..ఇప్పుడు పీసీసీ రావడంతో వన్ మ్యాన్ షో మాదిరిగా ముందుకెళ్లాలని చూస్తున్నారు. సొంత వ్యూహలతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేయడానికి, తన మాజీ దోస్తులని కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్‌లో ఉంటూ, అసంతృప్తిగా ఉన్న సీనియర్ నాయకులని లాగేసుకుందామని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్‌లో పలువురు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని రేవంత్ చూస్తున్నారు. అలాగే రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ సైకిల్ నేతలని సైతం కలిసి మద్ధతు తీసుకునేందుకు రేవంత్ ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఎలాగో తెలంగాణలో టీడీపీ పరిస్తితి బాగోలేదు కాబట్టి చంద్రబాబు సైతం రేవంత్ ఎదుగుదలకు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎందుకంటే గతంలో రేవంత్ టీడీపీలో ఏ పొజిషన్‌లో ఉండేవారో అందరికీ తెలిసిందే. బాబుతో రేవంత్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ పరిస్తితులు టీడీపీకి అనుకూలంగా లేకపోవడంతో రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్‌లోకి వచ్చినా సరే రేవంత్, బాబుల బంధం అలాగే ఉందని అంటున్నారు. అందుకే ఇప్పుడు రేవంత్‌కు పీసీసీ దక్కిందని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్‌లో మాజీ టీడీపీ నేతల డామినేషన్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.