ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు గుబులు చెందుతున్నారా? పార్టీపై ప్రేమ ఉన్నా.. బయటకు రాలేక పోతున్నారా? పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా చేపట్టలేక పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటు ఏపీలోను, అటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి టీడీపీ నేతల్లో ఉందని చెబుతున్నారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడే ఉన్న చంద్రబా బు.. తన సామాజిక వర్గం నేతలను కూకట్‌పల్లి, ఎల్బీ నగర్ వంటి కీలకమైన సెటిలర్లు ఉన్న నియోజకవ ర్గాల్లో ప్రచారం చేయాలని కోరినట్టు తెలిసింది.
అయితే.. ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. దీంతో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 105 స్థానాల్లో ఒక్క చోట కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. మరి దీనికి కారణం ఏంటి..? అని ఆరాతీస్తే.. టీఆర్ ఎస్ నేతలతో అక్కడ టీడీపీ నాయకులు పెనవేసుకున్న బంధమేనని తెలుస్తోంది. చిన్న చిన్న కాంట్రాక్టులు దక్కించుకోవడంతోపాటు.. వ్యాపారాలు వ్యవహారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ..టీఆర్ఎస్ నేతల ప్రోత్సాహంతోనే. దీంతోవారు ఆ పార్టీకి వ్యతిరేకంగానో.. లేక టీడీపీకి అనుకూలంగానో.. ప్రచారం చేసే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. ఇది పార్టీలో తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
ఇక, ఏపీలో అనేక కార్యక్రమాలకు పిలుపు నిస్తున్నారు చం ద్రబాబు. ముఖ్యంగా తనసామాజిక వర్గం నాయకులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో చంద్రబాబు ఇస్తున్న పిలు పును ఎవరూ పెద్దగా ఖాతరు చేయడం లేదు. కీలక నేతలు ముందుకు వస్తున్నా.. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతోంది? అని ఆరా తీస్తే.. ఏపీలోనూ అనేక జిల్లాల్లో నాయకులు సర్దుకు పోతున్నారు. చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేపట్టడంతోపాటు.. అధికార పార్టీ నేతలతో లోపాయికారీ ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు.
దీంతో ఇక్కడ కూడా నాయకులు రోడ్ల మీదకు వచ్చి.. ప్రభుత్వాన్ని నిలదీయ లేకపోతున్నారు. ఈ క్రమంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయం ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ భవిష్యత్తులో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు.