చంద్రబాబు లైట్… టీడీపీ ఎమ్మెల్సీ సీరియస్!

-

పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేందుకు ఏపీ సర్కారు విడుదల చేసిన జీవో 203పై ఇప్పటివరకూ ఉపయోగకరమైన మాట ఒక్కటి కూడా చంద్రబాబు పలికిన పాపాన పోలేదు అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా విపరీతంగా నడుస్తోన్న సమయమిది. ఎన్నో వీడియో కాన్ ఫరెన్స్ లు నిర్వహించిన చంద్రబాబు… ఈ విషయంపై మాత్రం ప్రజలకు ఏ క్లారిటీ ఇవ్వలేదు! కనీసం తెలంగాణ కు మద్దతుగానో, తన సొంత ప్రాంతమైన రాయలసీమకు సపోర్టుగానో ఒక్కమాటైనా చెప్పలేదు. ఇంత కీలకమైన విషయం బాబే మౌనం వహించేసరికి… తెలుగు తమ్ముళ్లు గత్యంతరం లేక ఏదో ఒక రాజకీయ విమర్శ చేసేసి సైడైపోతున్నారు. ఈ విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నారు! కానీ… ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు మాత్రం జగన్ కు మద్దతు ప్రకటించారు!

ఏపీ సర్కారు విడుదల చేసిన జీవో 203ను తప్పు పట్టాల్సిన అవసరమే లేదని వైసీపీ మంత్రులు, నేతలు చెబుతున్న తరుణంలో… రాయలసీమ ప్రాంతమైన కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. ఈ జీవో విషయంలో జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203ని సమర్థిస్తున్నాను అని ప్రకటించిన ఈ టీడీపీ ఎమ్మెల్సీ… రాయలసీమ వాసుల కోసం ఎవరు పోరాడినా అండగా ఉంటామని.. సీఎం జగన్‌ కు ఈ విషయంలో మద్దతుగా ఉంటామని ప్రకటించారు!! దీంతో పోతిరెడ్డి పాడు వ్యవహారం ఏపీలో కొత్త రాజకీయ పుంతలు తొక్కింది!

ఒక్క అమరావతి లో గ్రామాల స్థలాలపై తప్ప మొత్తం ఏపీ గురించి ఆలోచించే పరిస్థితి బాబుకు ఇప్పట్లో లేదు అనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… కనీసం తన సొంత ప్రాంతమైన రాయలసీమ విషయంలో కూడా బాబు స్పందించకుండా లైట్ తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలే వస్తున్నాయి! కరోనాతో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు విలవిల్లాడిపోయినా బాబు స్పందించలేదు… విశాఖలో 12 మంది మృతి చెందినా పలకరించలేదు… నేడు తన సొంత ప్రాంతానికి నీరందించే పనికి జగన్ పూనుకున్నా కూడా ఆ విషయంపై కూడా “మౌనమె నా బాష ఓ అమాయకపు ఏపీవాసా” అన్న చందంగా బాబు ఉంటున్నారు! దీంతో… ఈ పోతిరెడ్డి పాడు విషయంలో టీడీపీ అధినేత లైట్ తీసుకున్నా… టీడీపీ ఎమ్మెల్సీ మాత్రం సీరియస్ గానే తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version