ప్రపంచ వ్యాప్తంగా దేశస్థాయిల్లో అయినా.. రాష్ట్ర స్థాయిల్లో అయినా.. ఆఖరికి గ్రామస్థాయిల్లో అయినా మెజారిటీ సేవా కార్యక్రమాలు ట్రస్టుల ద్వారానే జరుగుతాయి అనడంలో సందేహం లేదు! ఈ క్రమంలో కరోనా సమయంలో సాయంచేసే మెజారిటీ పెద్దలు వారి వారికున్న ట్రస్టుల ద్వారానే చేస్తుండటం సహజం. ఈ క్రమంలో వైకాపా ఎమ్మెల్యే రోజా ఒక ట్రస్టు ద్వారా కరోనా సమయంలో సేవచేస్తున్నారు! ప్రస్తుతం ఈ విషయంపైనే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు!
వైసీపీ ఎమ్మెల్యే రోజా గత నెల రోజులుగా కరోనా వైరస్ ను ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారని నగరి టీడీపీ ఇన్ చార్జ్ గాలి భానుప్రకాష్ విమర్శిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లడాన్ని తప్పుబట్టిన ఆయన… నగరిలో కరోనా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం రోజానే అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ మొదలైనప్పటినుంచి రోజా ఏదో రూపంలో ఒక ట్రస్టు ద్వారా సహాయకార్యక్రమాలు చేయడాన్ని తప్పుపట్టిన భానుప్రకాష్… సేవ చేయాలంటే రోజా తన సొంత డబ్బులతో చేయాలని సూచిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే టీడీపీ నేతలు విమర్శలను ఎదుర్కొంటున్నారు.
నాలుగురోజుల క్రితం ప్రవాసాంధ్రులతో వీడియో కాంఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు… ఇలాంటి విపత్కరసయంలో సహాయకార్యక్రమాలు ఎలా చేయాలనే విషయంలో సీబీఎన్ ఫౌండేషన్ ద్వారా రూపకల్పన చేస్తామని తెలిపారు. అంటే… భవిష్యత్తులో కానీ.. లేక చంద్రబాబు ఏపీకి చేరిన అనంతరం ఏదైనా సహాయకార్యక్రమాలు చేస్తే… ఖచ్చితంగా సీబీఎన్ ఫౌండేషన్ ద్వారా చేస్తే అప్పుడు ఆ ఫౌండేషన్ లో కూడా ప్రజల సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది! కాగా… గతంలో టీడీపీ చేసిన సేవాకార్యక్రమాలు అన్నీ ఎన్టీఆర్ “ట్రస్ట్” పేరున చేసేవారు!