కాకినాడ కేంద్రంగారేగుతున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యోదంతం పై పలు సందేహాలు రేగుతున్నా కూడా పోలీసు విచారణలో జాప్యం కారణంగా నిజాలు ఏవీ వెలుగులోకి రావడం లేదు. మంత్రి బొత్స మాట్లాడిన మాటల కారణంగా నిందితుడు కు ప్రభుత్వం అండ ఉందన్న అనుమానాలను విపక్షం వ్యక్తం చేస్తోంది. హోం మంత్రి కూడా ఇంతవరకూ ఈ ఘటనపై స్టేట్మెంట్ ఇవ్వలేదు. బొత్స ఏం మాట్లాడినా కొంత వివాదం తప్పదు కనుక ఆయన మాటల్లో అర్థాలు వెతికి సిసలు నిజం లేదా యథార్థం తీసుకోవడం మాత్రం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అని విపక్షం ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యాన ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ను అరెస్టు చేయడం అంటే కుదరని పనే అన్న విధంగానే రాజకీయం ఉంది. లేదా పోలీసింగ్ ఉంది. అనంతబాబు కేసుకు సంబంధించి బొత్స మాత్రం విభిన్నం అయిన ధోరణిలో మాట్లాడుతున్నారు. తప్పు చేయలేదు అన్న ధైర్యంతోనే ఆయన బయట తిరుగుతూ ఉండవచ్చన్న మాట ఒకటి వినిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తావిస్తోంది. ఆయన తప్పు చేశారా లేదా అన్నది తరువాత అస్సలు ప్రాథమికంగా వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించి, కేసుకు సంబంధించి బాధితులకు ఊరట ఇచ్చే విధంగా పోలీసులు ఎందుకు ప్రవర్తించడం లేదు అన్న ప్రశ్న ఒకటి వినిపిస్తోంది.
ఇక ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అనంతబాబు చుట్టూనే తిరుగుతున్నాయి. మేమేం ఆయన్ను ఇంట్లో దాచామా ? ఆ విధంగా చేస్తే మీరు మమ్మల్ని ప్రశ్నించాలి అంటూ బొత్స తిరుగు ప్రశ్నలు సంధిస్తున్నారు. వాస్తవానికి ఈ కేసులో బాధితుల ఆరోపణల్లో భాగంగా అనంతబాబే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు కారకుడు అన్న వాదన వినిపిస్తోంది. ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక కూడా ఇది ఒక హత్యే అని చెబుతోంది.
హత్యకు కారకులు ఎవ్వరు ? అనంతబాబుపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఆయన కార్లోనే శవం దొరికినా దీనిపై మాట్లాడేందుకు ఎందుకు పోలీసులు తాత్సారం చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ మంత్రుల ధోరణి అస్సలు అర్థం కావడం లేదని, తప్పు చేస్తే శిక్షించాలి కానీ ఇలా వెనుకేసుకుని రావడం వల్ల అధికార పార్టీ పరువు పోతుందని కూడా విపక్షం అంటోంది.