తిరుపతి ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు పోలింగ్‌కు ముందు వేసుకున్న లెక్కలు.. పోలింగ్ తర్వాత వేసుకున్న లెక్కలు తారుమారాయ్యాయి. భారీ మెజారిటీ సాధించాలన్నది అధికారపార్టీ లక్ష్యం. గెలిచి తీరాలని విపక్ష పార్టీలు పోరాడాయి. గతఎన్నికలతో పోలిస్తే పోలింగ్ 14 శాతం వరకు తగ్గడంతో లెక్కలు సరిచూసుకుంటూ పందేలలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. వైసీపీ మెజార్టీ పై పందాలు కాస్తూనే బీజేపీ,టీడీపీ ఓట్ల పై కూడా పందాలకు దిగుతున్నారు.
ఏపీలో గత ఆరునెలలుగా తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై రాజకీయంగా ఎంతో చర్చ జరిగింది. షెడ్యూల్ ప్రకటించాక ఆ వేడి మరింత రాజుకుని పోలింగ్ రోజున నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేయడంతో భారీగానే ఓటింగ్ ఉంటుందని భావించినా..64.9 శాతమే పోలింగ్ నమోదైంది. అంచనాలకు భిన్నంగా ఓటింగ్ జరిగింది. 2019లో వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌కు 2 లక్షల 28 వేల మెజారిటీ వచ్చింది. ఈసారి డాక్టర్ గురుమూర్తికి 5 లక్షల మెజారిటీ తీసుకురావాలని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ప్రచారం జరిగింది.
కరోనా ఉద్ధృతి కారణంగా పోలింగ్ తగ్గుతుందని గ్రహించిన అధికార పార్టీ వర్గాలు తమ అంచనాలను సవరించుకున్నట్టు చెబుతున్నారు. 55 నుంచి 60 శాతం పోలింగ్ జరిగితే 3 లక్షల నుంచి మూడున్నర లక్షల మెజారిటీ వస్తుందని లెక్కలేస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు ఈ దిశగానే పందాలు కాస్తున్నారు. టీడీపీ, బీజేపీ సైతం వాస్తవాలకు దగ్గరగా తమ లెక్కలు ఉండేలా.. పోలింగ్ సరళిని దగ్గర పెట్టుకుని అంచనాలు వేసుకుంటున్నాయట. 2019లో టీడీపీ 4 లక్షల 90వేల వరకు ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి టీడీపీ తమకు వచ్చే ఓట్ల కంటే వైసీపీ లెక్కలేసుకుంటున్న మెజారిటీ తగ్గించడం మీదనే దృష్టి పెట్టింది.
ఇక టీడీపీ ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై కూడా భారీగా బెట్టింగ్ లు నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు వరకు వైసీపీకి ప్రత్యామ్నాయం మేమే అన్న బీజేపీ,జనసేన కూటమి గెలుపు కంటే వచ్చే ఓట్లపైనే కూడికలు తీసివేతలు వేసుకుంటోంది. లక్ష ఓట్లు వచ్చినా తాము సక్సెస్ అయినట్టేనని ఆ కూటమి భావిస్తోంది. మరొకవైపు డిపాజిట్ వస్తుందా లేదా అన్న సందేహాలూ కొంతమందిలో ఉన్నాయి. బెట్టింగ్ రాయుళ్లు మాత్రం తిరుపతిలో రూటు మార్చేశారు. గెలిచిన వారికి వచ్చే మెజారిటీపై కాకుండా..రెండు, మూడు స్థానాల్లో నిలిచే పార్టీలపై ఎక్కువ పందేలు కాస్తున్నారట. కొందరు బెట్టింగ్ రాయుళ్లు బీజేపీకి డిపాజిట్ వస్తుందా రాదా అని కూడా పందేలు కాస్తున్నారట.