హుజురాబాద్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేయాలనే ధ్యేయంతో టీఆర్ఎస్ పార్టీ పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సర్వశక్తులను ఒడ్డుతోంది. ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఆర్థిక శాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు వ్యవహరిస్తున్నారు. సిద్దిపేట కేంద్రంగానే హుజురాబాద్ పరిస్థితులను ఎప్పికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కుల సంఘాల నేతలతో సమావేశమవుతున్నారు. అయితే, ఇటీవల హరీశ్ చేసిన కామెంట్స్ ఆయన్ను విమర్శల పాలు చేస్తున్నాయనే చెప్పొచ్చు.
బీజేపీ తరఫున హుజురాబాద్‌లో బరిలో ఉన్న ఈటల రాజేందర్ వీల్ చైర్‌లో త్వరలో వచ్చి ప్రచారం చేస్తారని, డ్రామాలు ఆడేందుకు పూనుకుంటారని మంత్రి హరీశ్ వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నిది. వాస్తవంగా ఈటల రాజేందర్ పాదయాత్రలో అస్వస్థతకు గురి కాగా మోకాలికి సర్జరీ చేశారు వైద్యులు. ఈ నేపథ్యంలో ఉద్యమ సహచరుడైన ఈటలపై ఇలాంటి కామెంట్స్ చేయడం సబబు కాదేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ వ్యాఖ్యలకు ఈటల కూడా స్పందించారు. తానెంత కమిట్‌మెంట్‌తో పని చేస్తానో అందరి కంటే ఎక్కువగా మంత్రి హరీశ్‌కే తెలుసని, ఆయన అలాంటి కామెంట్స్ చేయడం ఆయన విజ్ఞత అని ఈటల రాజేందర్ తెలిపారు. మొత్తంగా మంత్రి హరీశ్ వ్యాఖ్యల పట్ల విమర్శలే వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున అన్ని తానై వ్యవహరించిన మంత్రి హరీశ్, హుజురాబాద్‌లోనూ బాధ్యతలు తీసుకోవడం ద్వారా ఈ ఎన్నికలో ఓటమి పాలయితే ఆయన ప్రాధాన్యత తగ్గే అవకాశాలుంటాయోమోనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈటల రాజేందర్ త్వరలో మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పింక్ పార్టీ ఎలాంటి వ్యూహాలను రచించబోతుందో చూడాలి.