హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడానికి అధికార టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఈటల రాజేందర్ చెక్ పెట్టడానికి తన అధికార బలమంతా ఉపయోగిస్తుంది. అలాగే రాజకీయంగా వ్యూహాత్మకంగా వెళుతుంది. ఇప్పటికే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లు ఖర్చు పెడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కులాల వారిగా పథకాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో రాజకీయంగా హుజురాబాద్ బలపడేందుకు ఇతర పార్టీలకు చెందిన నాయకులని పార్టీ లోకి తీసుకున్నారు. అలాగే ఈటల రాజేందర్ కు చెక్ పెట్టడానికి టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హుజురాబాద్‌లో మకాం వేసి కారు గుర్తుకు ఓటు వేయాలని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బ్యాచ్ కొత్త ఎత్తుగడలతో హుజురాబాద్ లో రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
అదేంటంటే కారు గుర్తుకే ఓటు వేయాలని తిరుగుతున్న టిఆర్ఎస్ నేతలు, ఈటల రాజేందర్‌ది కూడా కారు గుర్తు అని చెప్పి ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకాలం ఈటల రాజేందర్ కారు గుర్తు పైన పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇప్పుడు బిజెపిలో చేరి కమలం గుర్తు తో పోటీ చేస్తున్నారు. కానీ హుజురాబాద్ ప్రజలకు కారు గుర్తు అంటే ఈటల అనేవిధంగా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని గులాబి నేతలు, ఈటల రాజేందర్‌ది కారు గుర్తు అని ప్రచారం చేస్తున్నారు.
దీనివల్ల ఈటల రాజేందర్‌కు ఓటు వేయాలి అనుకున్న వాళ్లు కూడా కారు గుర్తుకు ఓటేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా టిఆర్ఎస్‌కు బెనిఫిట్ అవుతుంది. అయితే ఆ విషయాన్ని గ్రహించిన ఈటల రాజేందర్, టిఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తనది కమలం గుర్తు అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి ఈ గుర్తులు రాజకీయం హుజురాబాద్ ఉపఎన్నికలో ఏ మేరకు ఈటల రాజేందర్‌కు ఇబ్బంది అవుతుంది. అలాగే టిఆర్ఎస్ నేతలు ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుందో.