తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాసలో రాజకీయంగా మార్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం దాదాపు ఏడాదిగా జరుగుతూనే ఉంది. కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని, తెరాస బాధ్యతలు మొత్తం హరీశ్ రావు చూస్తారని వ్యాఖ్యానించడం, దానికి సంబంధించి ఏ స్పష్టతా రాకపోవడం వంటివి మనం చూస్తున్నాం. అయితే గత నెల రోజుల నుంచి ఒక ప్రచారం మాత్రం ఎక్కువగా జరుగుతుంది. కేటిఆర్ ముఖ్యమంత్రిగా, కెసిఆర్ సూపర్ సిఎం అవుతారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపధ్యంలో ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది ముందే ఊహించిన హరీశ్ రావు చాలా జాగ్రత్తలు పడుతున్నారని అంటున్నారు. వాస్తవానికి టిఆర్ఎస్లో కెసిఆర్ కి ఎంత ప్రాధాన్యత ఉందో హరీశ్ రావుకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి కెసిఆర్ వెంట నడిచిన ఆయనకు పార్టీ సీనియర్ నేతలతో, తెలంగాణా ఉద్యమం సమయంలో నడిచిన విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా హరీశ్‌కు మద్దతు తెలిపే అవకాశం ఉందని అంటున్నారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో హరీశ్‌కు మంచి పట్టుంది. పార్టీ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు హరీశే ఆపద్భాంధవుడిగా చాలాసార్లు కాపాడాడు. అలాంటి హరీశ్‌కు మద్దతు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఈ జిల్లాల్లో ఉన్న 80 శాతం మంది నేతలు హరీశ్ వెంట నడిచే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. వారిలో పార్టీ సీనియర్లు ఉన్నారని, హరీశ్‌కు ప్రాధాన్యత తగ్గించడ౦ వారు తట్టుకోలేకపోతున్నారన్న వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.
వాస్తవానికి హరీశ్‌కు మొన్న మంత్రి పదవి ఇచ్చినా, తప్పసరి పరిస్థితుల్లోనే అది జరిగిందని, నాయకత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని పార్టీ క్యాడర్‌కు, హరీశ్‌కు కూడా తెలుసు. జాతీయ పార్టీలు రమ్మంటున్నా, కార్యకర్తలు సొంతపార్టీ పెడదామన్నా, ఆయన స్పందించడంలేదు. ఇది తొందరపాటుకు సమయం కాదని, వేచిచూడటమే ప్రస్తుత కర్తవ్యమని హరీశ్‌కు బాగా తెలుసు.