అప్పులు ఎందుకు చేయాలి ? ఎవరి దగ్గరా దేహీ అని చేయి చాచాల్సిన పనే లేదు కదా! అప్పు ఎందుకు చేయాలి? ఇదే వాదన ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. పన్నులు ఏమయినా తక్కువలో ఉన్నాయా? పెట్రో ఉత్పత్తుల ధరలు ఏమయినా తగ్గి ఉన్నాయా ? ఓ దేశాన్ని నడిపే శక్తికి అప్పు అన్నది భారం అని తెలియదా? అని ఇవాళ కొత్త సందేహాలు రేగుతున్నాయి.
వార్త టీఆర్ఎస్ వండి వార్చినా కూడా కొన్ని మాటలు సత్యాలుగానే ఉన్నాయి. అయితే ఆ పార్టీ తప్పులు చేయలేదా?
చేసింది.. నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఆ లెక్క కూడా తీస్తే చూడాలని ఉంది. ఆ లెక్క గురించి మాట్లాడితే విని విచారించాలని ఉంది అంటోంది బీజేపీ. ఇక విదేశీ అప్పులు ఆరోజూ ఉన్నాయి ఈ రోజూ ఉన్నాయి. కానీ మారిన పరిణామాల రీత్యా తాము కరోనా బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిన రోజు ను సుప్రీం వాకిట తన బేలతనాన్ని ప్రదర్శించిన తీరును మరువలేం అని అంటోంది టీఆర్ఎస్. ఎట్టకేలకు బాధితులకు రెండు లక్షలు ఇవ్వమంటే యాభై వేలు ఇస్తామని ఒప్పుకుని చాలా రోజుల పాటు సుప్రీంలో వాదనలు వినిపించి వినిపించి ఆఖరికి ఆ కొద్దోగొప్పో పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. కరోనాతో మరణించిన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం అందించాల్సి ఉన్నా, కనీసం ఫ్యునరల్ ఛార్జెస్ కూడా ఇవ్వలేకపోయింది.. ఇది కూడా కేంద్ర వైఫల్యమే అంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి.
అప్పులు లేనిదే పూట గడవని వైనంతో భారత్ ఉందా ? లేదా అప్పులు కేవలం కరోనా కారణంగానే వచ్చి పడ్డాయా ?
ఇటు రాష్ట్రం కాని అటు దేశం కానీ సాధించాల్సింది ఎంతో ! కానీ అభివృద్ధి అంతా అప్పులకు ముడిపడి ఉందా ? అన్న అనుమానాలే ఎక్కువ అవుతున్నాయి. ఈ దశలో అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ అప్పులతోనే తమ ప్రభుత్వాలను నడుపుతున్నాయన్నది తేటతెల్లం అయిపోయింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప! సంపద సృష్టి కేంద్రాల నిర్మాణానికి మాత్రం ఎవ్వరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ల నిర్వహణ అయితే లేదు.
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు కానీ ప్రజలకు ఏం చేయాలో అది చేయండి చాలు. ఇదిగో ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్న విధంగా బీజేపీ అప్పుల చిట్టాను తెరపైకి తెచ్చి టీఆర్ఎస్ పార్టీ కొత్త యుద్ధాలకు నాంది పలికింది. ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ మీడియా ప్రతినిధులు చెబుతున్న ప్రకారం.. “దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసం చేసిన అప్పు ఎంతో తెలుసా? అక్షరాలా.. రూ.55,87,149 కోట్లు..ఘనత వహించిన మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటినుంచి గత ఎనిమిది సంవత్సరాలలో చేసిన అప్పు ఎంతో తెలుసా? అక్షరాలా.. రూ.80,00,744 కోట్లు..” అని అంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి.