వివాదాలున్న ప్రతిసారీ జియర్ స్వామి మాట్లాడాలి
లేదా వివాదానికి కారణం అయిన కేసీఆర్ అయినా మాట్లాడాలి
ఇద్దరూ మాట్లాడకపోతే అనుమానాలు వస్తాయి సందేహాలు రేగుతాయి
వాటికి పరిష్కారం వెతుక్కోవాల్సిన బాధ్యత ప్రజలది కాదు పాలకులదే!
అంటే కేసీఆర్ దే ! ఇది కేవలం రెండు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధంలోభాగమా అన్న సందేహానికి కూడా అటు బీజేపీ కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ జవాబు చెప్పాల్సి ఉంది.మౌనంగా ఉంటూ తెలంగాణలో రేగుతున్న కొట్లాటను పరిష్కరించేందుకు ముందుకు రాకుండా ఉండడం అన్నది ఏ పాలక పక్షానికి అయినా ఏ ప్రతిపక్షానికి అయినా తగని పని.
మతం వేరు మానవతా దృక్పథంతో కూడిన ఆచరణ వేరు.ఈ రెండూ కూడా ఒక్కటే అయినప్పుడు మంచి ఫలితాలే వస్తాయి. ముచ్చింతల్ కేంద్రంగా చినజియరు స్వామిజీ ఆశ్రమం ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుంది అన్నది ముందున్న కాలమే తేల్చాలి.ఆ ఆలయం ప్రభోదించే సమానత్వం అన్నది అక్కడ చెల్లుబాటులో ఉందా లేదా అన్నది కూడా ఒక్కసారి వెతికి చూడాలి. ఆ తరువాతే జియరు స్వామి ఇతరుల నమ్మకాలపై ప్రశ్నాస్త్రాలు సంధించడం కానీ లేదా వారి నమ్మకాలను హేళన చేయడం కానీ చేయాలి. (ఇవన్నీ ఇప్పుడెందుకు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు తరాల నాటి నమ్మకాలను ప్రశ్నిస్తూ కొందరిని మానసికంగా కుంగుబాటుకు గురి చేస్తున్నాయి కనుక)
తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకు ఏకైక సాంస్కృతిక వారథి తానే అని అభివర్ణించుకునే స్థాయి చినజియర్ ది. సమతా మూర్తి ప్రాభవాన్ని చాటేందుకు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం నెలకొల్పి..ఇందుకు వెయ్యి కోట్లు ఖర్చు చేయించిన లేదా చేసిన స్థాయి కూడా ఆయనదే! ఇప్పుడు విశిష్టాద్వైతంను ప్రచారం చేస్తారో లేదా ఇతర కారణాలతో ఆశ్రమాన్ని మరింత వృద్ధి చేస్తారో కానీ ముచ్చింతల్ కేంద్రంగా అనే విమర్శలు రేగుతున్నాయి.ముఖ్యంగా ఈ ఆలయాన్ని ప్రముఖ కార్పొరేట్ కంపెనీ దగ్గరుండి నిర్మించిందని ఆరోపణలు కూడా ఉన్నాయి.ప్రభుత్వ పెద్దల సహకారం కూడా ఇందుకు ఎంతగానో ఉపయోగపడిందని వాదనలూ ఉన్నాయి.ఎవరి వాదనలు ఎలా ఉన్నా కేసీఆర్ కు అత్యంత సఖ్యంగా ఉండే స్వామిజీ చినజియరు అన్నది సుస్పష్టం.
ఇప్పుడీయన ఓ వివాదంలో ఉన్నారు.ఆ..వివాదం నుంచి ఏ విధంగా బయటపడతారో లేదో అన్నది అటుంచితే సమక్క సారక్క లపై స్వామీజీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎందుకని ఖండించలేకపోతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని అత్యంత దారుణంగా విమర్శించిన స్వామిజీ విషయమై కేసీఆర్ ఎందుకు స్పందించరు. తెలంగాణ వాదానికి ప్రతీకగా నిలిచి ఉద్యమానికి సారథ్యం వహించిన నాయకుడిగా పేరున్న కేసీఆర్ ఎందుకు అని మౌనంగా ఉండిపోతున్నారు.ఈ విషయంలో వాదాలు ఎలా ఉన్నా వనదేవతలను ఉద్దేశించి అక్కడి సంస్కృతిని ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడిన స్వామిజీని ఎందుకని నిలదీయలేకపోతోంది టీఆర్ఎస్.అంటే స్వామీజీని ఉద్దేశించి ఏమయినా వ్యాఖ్యానిస్తే సంబంధిత వ్యక్తుల ఓట్లు పోతాయనా? లేదా స్వామిజీ బీజేపీకి దగ్గరగా ఉన్నారు కనుకనే కేసీఆర్ వర్గాలు ఎప్పుడో స్వామీజీ చెప్పిన మాటలను వెలుగులోకి తెచ్చాయా ? ఇలాంటి ప్రశ్నలు కేసీఆర్ మౌనంగా ఉన్నంత కాలం రేగుతూనే ఉంటాయి.