తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డికి త్వరలో ప్రమోషన్ దక్కబోతుందా..? ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కు అదే స్థాయిలో ఉండే పదవి దక్కబోతుందా..? ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కు అటు ప్రమోషన్ ఇచ్చి.. ఇటు పీసీసీ నుంచి పీకేసే కార్యక్రమం జరుగుతుందా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ను ఏఐసీసీ నియమించింది. ఆయన పనిచేసిన రెండున్నర ఏండ్ల తరువాత ఆయనను తప్పించి 2015లో ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది.
అప్పటి నుంచి ఇప్పటి దాకా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కు త్వరలో ఉద్వాసన తప్పేలా లేదనే సంకేతాలు గత రెండేళ్ళ కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా దిగ్వీజయంగా నాలుగేళ్ళకు పైగా కొనసాగుతూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సారధ్యబాధ్యతలు మోసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫలితాలు చేదు అనుభవాన్నే చూపాయి. దీంతో ఉత్తమ్‌ను మార్చుతారనే ప్రచారం జరిగింది. అయితే అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయనను అలాగే కొనసాగించారు.
తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల ముందుకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చుతారని అంతా అనుకున్నారు. కానీ ఉత్తమ్ నేతృత్వంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా మంచి ఫలితాలనే సాధించింది. అంతే కాదు ఏకంగా తాను ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇది ఏఐసీసీకి బాగా నచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఎంపీగా గెలవడం అనేది అసాద్యమైన విషయం.. అలాంటిది ఎంపీగా గెలవడంతో కాంగ్రెస్ పార్టీ పీసీసీ నుంచి ఆయనను మార్చలేదు.
అయితే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎక్కువగా ఢిల్లీలో ఉంటున్నారు. జాతీయ రాజకీయాల్లో ఉత్తమ్ సేవలను కోరుకుంటుంది ఏఐసీసీ. అందుకే ఉత్తమ్‌కు ఏఐసీసీలో కీలకమైన ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ను తప్పించి.. తరువాత ఏఐసీసీలోకి తీసుకుని జాతీయ స్థాయిలో పార్టీకి సేవలను పొందాలని భావిస్తున్నదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అంటే ఉత్తమ్‌కు రాహుల్ గాంధీకి ఉన్న సన్నిహిత సంబంధాలు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్‌కు ప్రమోషన్ రావడానికి దోహదం చేస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో బాగా యాక్టీవ్‌గా పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఉత్తమ్‌ను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేలా ప్రధాన కార్యదర్శి పోస్టు ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తుంది అని టాక్. ఏదేమైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాబోవు రోజుల్లో జాతీయస్థాయిలో చక్రం తిప్పబోతున్నారన్న మాట.