వైసీపీకి త‌ల‌నొప్పిగా విక్ట‌ర్ ప్ర‌సాద్ ?

-

ఆయ‌న ఒక బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉన్నారు. కానీ త‌రుచూ వివాదాల‌కు తావిచ్చే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆయ‌నే ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ విక్ట‌ర్ ప్ర‌సాద్. ప‌దవి అన్న‌ది త‌న‌కు వెంట్రుక‌తో స‌మానం అని సంచల‌నాత్మ‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకునేదే లేద‌ని, ఇటీవ‌ల ఓ సంద‌ర్భంలో క‌లెక్ట‌ర్ల‌నూ, ఎస్పీల‌నూ హెచ్చ‌రించారు. చిత్తూరు జిల్లా, స‌త్య‌వేడు మండ‌లం, మ‌ద‌నంబేడు గ్రామంలో అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంతరం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్- లో  చ‌ర్చ‌కు తావిస్తున్నాయి.

గ‌తంలో కూడా ఇదేవిధంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వివాదాల‌కు తావిచ్చారు. నిన్న‌మొన్న‌టి వేళ చేసిన వ్యాఖ్య‌లతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. వాస్త‌వానికి ద‌ళితుల‌కు అన్యాయం జ‌రిగితే ప్ర‌శ్నించాల్సిందే ! దాన్ని ఎవ్వ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు కానీ అదే ప‌నిగా అధికారుల‌ను తిట్ట‌డం కానీ, అవ‌మానించ‌డం కానీ చేయ‌డం త‌గ‌దు అన్న వాద‌న అయితే వినిపిస్తోంది. త‌న‌ను ప‌ద‌వి నుంచి తొల‌గిస్తే కొన్ని వంద‌ల అమ‌లాపురాల‌ను సృష్టిస్తాన‌ని హెచ్చ‌రించారు. ఒక‌వేళ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తే వీధుల్లోకి వ‌చ్చి విధ్వంసం సృష్టిస్తాన‌ని అన్నారు.

ఇప్ప‌టికే అనేక వివాదాల‌తో స‌త‌మ‌తం అవుతున్న రాష్ట్ర ప్ర‌భుత్వానికి  విక్ట‌ర్ ప్ర‌సాద్ ప్ర‌వ‌ర్త‌న కొత్త త‌ల‌నొప్పిగా ఉంది. పేర్ని నాని చొర‌వ‌తో ఉమ్మ‌డి కృష్ణా జిల్లా, మ‌చిలీప‌ట్నంకు చెందిన ఈ లాయ‌ర్ -కు ఎస్సీ  క‌మిష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని జ‌గ‌న్ అప్ప‌గించారు. గ‌తంలో ఎస్సీల త‌రఫున కొన్ని కేసుల‌ను వాదించి, గెలిచిన నేప‌థ్యం ఉంది ఈయ‌న‌కు. ఆ ఉద్దేశంతోనే పేర్నినాని ఈయ‌న్ను సీఎంకు ప‌రిచ‌యం చేసి, బాధ్య‌త గ‌ల ప‌ద‌విని క‌ట్టబెట్టారు. ప‌ద‌వి అందుకున్న నాటి నుంచి నిన్న‌మొన్న‌టి  ఎమ్మెల్సీ అనంత‌బాబు ఇష్యూ వ‌ర‌కూ ఆయ‌న తీవ్ర స్వ‌రంతో మాట్లాడుతూనే ఉన్నారు అని కొంద‌రు వైసీపీ నాయ‌కులే వ్యాఖ్యానిస్తు న్నారు. కొన్ని సార్లు ఉన్న‌తాధికారులు న‌చ్చ‌జెప్పినా విన‌డం లేదు అని కూడా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌నల‌కు వెళ్తున్నారు. ప్రొటోకాల్ పేరుతో ఆయ‌న అక్క‌డ క‌లెక్ట‌ర్ స్థాయి వ్య‌క్తుల‌ను సైతం దూషిస్తున్నారు. కొంద‌రు పోలీసు అధికారుల‌ను తాను త‌ల్చుకుంటే ఏమ‌యినా చేయ‌గ‌ల‌ను అన్న హెచ్చ‌రిక‌లు కూడా చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న నైజంతో విసిగిపోయి ఉన్న కొంద‌రు పోలీసు అధికారులు విష‌యాన్ని సీఎం వ‌ర‌కూ తీసుకుని వెళ్లారు. సీఎం కూడా సీరియ‌స్ అయ్యారు. కానీ ఆయ‌న్ను  వ్య‌క్తిగ‌తంగా పిలిచి మాట్లాడ లేదు. తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో మ‌ళ్లీ అలజ‌డులు రేగే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే కోన‌సీమ‌లో పరిణామాలు చ‌క్క‌దిద్దుకుంటున్న నేప‌థ్యంలో ఇటువంటి వ్యాఖ్య‌లు మంచివి కావ‌న్న భావ‌న సామాజిక కార్య‌క‌ర్త‌ల్లో వ్య‌క్తం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version