మీరు ఎవరు వస్తారో రండి..తేల్చుకుందాం అంటున్నారు ఆ ఎమ్మెల్యే.. ప్రతిపక్ష టీడీపీ నుంచి ఓ యువ నాయకుడి పేరు పరిశీలనలో ఉన్నా.. పొత్తుల్లో భాగంగా జనసేన అభ్యర్థి సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.. ఇంతకీ రసవత్తరంగా మారిన ఆ నియోజకవర్గం ఏంటో మీరే చూడండి..
ధర్మవరం నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. అధికార పార్టీ నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరోసారి బరిలో ఉండగా.. ప్రతిపక్ష పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనే విషయం ఇంతవరకు స్పష్టత రాలేదు.. బరిలో ఉండేది తానేనంటూ పరిటాల శ్రీరామ్ ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. పార్టీ నుంచి ఇంతవరకు క్లారిటీ రాలేదు..
బీజేపీ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్య నారాయణ టిడిపిలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని సూర్యనారాయణ రెడ్డి ఎక్కడా లీక్ చేయనప్పటికీ.. గత కొద్ది రోజులుగా ధర్మవరంలో ప్రచారం నడుస్తోంది.. మరోపక్క జనసేన నుంచి చిలుకము మధుసూదన్ రెడ్డి పోటీలో ఉండబోతున్నారు.. వీరు ముగ్గురు టిక్కెట్ కోసం అధినేతల వద్ద సిఫారసులు చేస్తున్నారు..
టిడిపి బిజెపి జనసేన కలిస్తే పరిస్థితి ఏంటి..?
ముగ్గురు అభ్యర్థులు వేరువేరు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి ధర్మవరంలో నెలకొంది.. అయితే టిడిపి జనసేన బిజెపి మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే టికెట్టు ఎవరికి వస్తుందా అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్ మాత్రం టికెట్ తనకె అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.. కేతిరెడ్డి పై గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన తహతహలాడుతున్నారు.. అందుకు తగ్గట్టుగానే గత నాలుగేళ్లుగా ధర్మవరంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.. కేతిరెడ్డే టార్గెట్ గా శ్రీరామ్ విమర్శలు సంధిస్తున్నారు. దానికి కేతిరెడ్డి తనదైన శైలిలో బాణాలు ఎక్కు పెడుతున్నారు.. వీరిద్దరి మధ్య పొలిటికల్ స్టంట్స్ నడుస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందా లేక అభ్యర్థి మారతారా అనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తుంది..