ఎన్నికల సమయం దగ్గరపడటంతో వైసీపీ, టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సవాళ్ళు విసురుకుంటున్నారు. రాజకీయంగా ఎవరూ తగ్గడం లేదు. ఇదే సమయంలో తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఒక సవాల్ చేస్తే..దానికి ప్రతిగా టిడిపి నేత బోండా ఉమా మరో సవాల్ చేశారు.
అసలు జగన్‌ని విమర్శిస్తే మట్టికొట్టుకు పోతారని ఫైర్ అయిన బొత్స..వచ్చే ఉగాది నాటికి టిడిపి-జనసేనలు ఉండవని, ఒకవేళ ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని బొత్స ఛాలెంజ్ చేశారు. ఇక బొత్స సవాల్ పై టిడిపి నేత బోండా ఉమా తీవ్రంగా స్పందించారు. ఆ రెండు పార్టీలు ఉండవ అంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ..? హత్యలకు ప్లాన్ చేశారా..? అంటూ బోండా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని కావాలంటే రాసి పెట్టుకోంవాలని, వైసీపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని అన్నారు. ఎన్నికల్లో చీపురుపల్లినుంచి బొత్స సత్యనారాయణను ఓడిస్తాం అని చెప్పుకొచ్చారు.
బొత్స సత్యనారాయణ కుటుంబ సహా 50మంది ఎమ్మెల్యేలు టిడిపికి టచ్ లో ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లకు 175 సీట్లు గెలిస్తే మాపార్టీని మూసేస్తామని బోండా ప్రతి సవాల్ చేశారు. నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్ర చూసి వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయని అందుకే అవాంతరాలు కల్పిస్తోందని ఫైర్ అయ్యారు.
మొత్తానికి ఇలా రెండు పార్టీల నేతలు సవాల్, ప్రతి సవాల్ చేసుకుంటున్నారు. అయితే బొత్స అన్నట్లు..ఉగాది నాటికి టిడిపి-జనసేనలు లేకుండా పోవడం అనేది జరగని పని..అలాగే వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో టచ్ లో ఉన్నారనే దానిలో నిజం పెద్దగా ఉండదు.