అమరావతి (విజయనగరం) : జిల్లా వ్యాప్తంగా జ్వరాలతో 86 మంది చనిపోయినా సీఎం చంద్రబాబు నాయుడు చలించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఒక్క సాలూరులోనే జ్వరాలతో 21 మంది చనిపోయారని, కలసా గ్రామంలో నెలరోజుల్లో 11 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 291వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన చంద్రబాబు పాలనపై విరుచుకపడ్డారు.
108కు ఫోన్ చేస్తే..
‘సాలూరు గిరిజన ప్రాంతం, గిరిజన నేపథ్యం.. ప్రాతినిథ్యం వహిస్తున్నది గిరిజన ఎమ్మెల్యే రాజన్న దొర. ఆయనకున్న వ్యక్తిత్వం పక్కనే ఉన్న బొబ్బిలికి రాజాకు కూడా లేదు. బొబ్బిలి ఎమ్మెల్యేను సంతలో పశువులా కొన్నారు. అలానే రాజన్నదొరను కూడా కొనాలని ప్రయత్నించినా అమ్ముడుపోనని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అత్యవసర పరిస్థితుల్లో 108కు ఫోన్ చేస్తే సకాలంలో వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేవి. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే కండీషన్‌లో లేవు అని సమాధానం వస్తోంది. అంబులెన్స్‌లు పొరపాటున వచ్చినా అస్పత్రికి తీసుకెళ్తుందో.. లేదో తెలియని పరిస్థితి. 8 మంది డాక్టర్లు ఉండాల్సిన సాలూరు ఆసుపత్రిలో నలుగురు మాత్రమే ఉన్నారు అని జగన్ విమర్శించారు.
ముఖ్యమంత్రే దళారైతే..
సాలూరు కూరగాయల పంటలకు ప్రసిద్ధి అని. కానీ రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న కూరగాయలను హెరిటేజ్‌లో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారని జగన్ విమర్శించారు. దళారీలను కట్టడి చేసి రైతులకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రే దళారీగా తయారయ్యాడని ఆరోపించారు.పోలవరంను పూర్తిగా అవినీతిమయం చేశారని. పోలవరం సబ్ కాంట్రాక్టర్ మంత్రి యనమల వియ్యంకుడు అని వెల్లడించారు.