ఏ రాజకీయ పార్టీకైనా సరే.. ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. వారు ప్రవేశపెట్టే మ్యానిఫెస్టోయే కీలకం అని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి గల కారణాల్లో ఒకటి.. ఆయన ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోయే. అయితే ఈ సారి మాత్రం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వైకాపా ఇప్పటికే నవరత్నాల పేరిట తన మ్యానిఫెస్టోను ప్రకటించగా, దానికి స్పందన ఎలా ఉందనే విషయాన్ని ప్రస్తుతం ఆ పార్టీ ప్రతినిధులు తెలుసుకుంటున్నారు. అయితే కేవలం నవరత్నాలు మాత్రమే కాకుండా.. మ్యానిఫెస్టోలో మరిన్ని అంశాలను చేర్చే దిశగా వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
రానున్న ఎన్నికల నేఫథ్యంలో తమ ఎన్నికల మ్యానిఫెస్టోను మరింత పకడ్బందీగా రూపొందించాలని వైసీపీ అధిష్టానం నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉన్న సమస్యలను పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా తెలుసుకుని అందుకు తగిన విధంగా మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నారని తెలిసింది. అలాగే జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా మ్యానిఫెస్టోలో చేర్చాలని చూస్తున్నారట.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యతను కూడా తీసుకుంటామనే హామీని కూడా మ్యానిఫెస్టోలో చేర్చనున్నారట. దీంతోపాటు రైతులకు, మహిళలకు ప్రత్యేక పథకాలను, ప్రత్యేక హోదా సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు.. తదితర అంశాలను కూడా వైసీపీ తన మ్యానిఫెస్టోలో చేరుస్తుందని.. ఆ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే మ్యానిఫెస్టోను రూపొందిస్తామని ఆయన చెప్పారు..!