తాజాగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసేందుకు సిద్ధమైన గన్నవరం ఎమ్మెల్యే, యువ నాయకుడు, కమ్మ వర్గానికి చెందిన వల్లభనేని వంశీమోహన్ వైసీపీ అరంగేట్రపై అనేక కథనాలు ఇప్పటికే వచ్చాయి. వాస్తవానికి ఆయనకు ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన పార్టీ మారిపోతారనే ప్రచారం సాగింది. ఎన్నికలకు ముందు హైదరాబాద్లో వంశీకి ఉన్న ఆస్తుల విషయంలో అక్కడి ప్రభుత్వం ఆయనను ఇబ్బంది పెడుతోందని, ఆయనను నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి కూడా చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే, ఎలాగోలా ఎన్నికల్లో విజయం సాధించిన వంశీ ఆ మరుసటి రోజు నుంచే పార్టీ మార్పుపై దృష్టి పెట్టారనే వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, ఈ విషయంలో వంశీ ఎప్పుడూ ఎక్కడా నోరు మెదిపింది లేదు.
కానీ, తాజాగా ఆయన వైసీపీ అధినేత, సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.దీపావళి అనంతరం ఆయన తన మనసులో మాటను వెల్లడిస్తానని మీడియాకు చెప్పేశారు. అయితే, వంశీ వైసీపీలో చేరేందుకు గల కారణాలపై అనేక కథనాలు వచ్చాయి. ప్రధాన మీడియా సహా సోషల్ మీడియాలో నూ వంశీ పార్టీ మార్పుపై కథనాలు వచ్చాయి. ఆయనపై కేసులు నమోదయ్యా యని, అందుకే ఆయన పార్టీ మారుతున్నారని చెప్పుకొచ్చారు. అదేసమయంలో తాను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా గన్నవరం నియోజకవర్గంలో పేదలకు పంచిన పట్టాలు నకిలీవనే కేసు కూడా నమోదైంది. దీంతో వంశీ ఒకరకంగా ఉక్కిరి కి గురయ్యారు. అందుకే పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున కథనాలు చోటు చేసుకున్నాయి.
అయితే, రాజకీయాల్లో ఉన్న వారికి కేసులు మామూలే అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అనుకుంటే.. కేసులకు నాయకులు భయపడిపోయే వారే అయితే.. ముందుగా జగనే వెళ్లి అప్పట్లో కాంగ్రెస్‌లో చేరిపోయి ఉండాల్సింది. ఎందుకంటే.. కాంగ్రెస్‌ను ఎదిరించిన తర్వాత ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. సీబీఐ, ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్‌లోని పెద్దలు కొందరు పార్టీలోకి వచ్చేయ్.. నీ వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయి.. ఎలాంటి కేసులు లేకుండా చూస్తాం.. అని అన్నప్పుడు కూడా జగన్ వెనుదిరిగి చూసుకోలేదు. ఇక, ఈ ఒక్క ఉదాహరణే కాదు.. అనేక మంది నాయకులు కేసులు ఎదుర్కొంటున్న వారే.
అయితే, తాజాగా వంశీపై నమోదైన కేసు పెద్ద విషయం కూడా కాదు. అయినా కూడా ఆయన కేసుల భయంతోనే వైసీపీలోకి చేరుతున్నారనడంలోనూ అర్ధం లేదు. ఈ నేపథ్యంలోనే అసలు వంశీ పార్టీ మార్పు వెనుక ఏంజరిగిందనే విషయంపై లోతైన చర్చ సాగుతోంది. ఈక్రమంలో బయటకు వచ్చిన కీలక అంశం. మంత్రి పదవి! తాను కమ్మ వర్గానికి చెందిన నాయకుడే అయినా.. టీడీపీలో ఎలాంటి విలువలేకుండా పోయిందనే ఆవేదనను తరచుగా ఆయన మీడియావద్ద పంచుకున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. అదేసమయంలో తన వర్గానికే చెందిన మాజీ మంత్రి, కృష్ణాజిల్లాకు చెందిన నాయకుడు తనపై ఆధిపత్యం చేయడాన్ని కూడా వంశీ భరించలేక పోయారు. ఈవిషయంలో ఆయన అనేకమార్లు చంద్రబాబుకు ఫిర్యాదులు చేసినా.. ఆయన లైట్ తీసుకున్నారు.
అంతేకాదు.. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా.. స్థానిక సమస్యలపై ప్రభుత్వానికి వివరించేందుకు సచిలయానికి వెళ్లిన సందర్భంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ అవమానాలు, ఆధిపత్యాలు భరించలేని తత్వంతోనే వంశీ ఇప్పుడు పార్టీ మారుతున్నారని అంటున్నారు. అదేసమయంలో జగన్ కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. రెండున్నరేళ్ల తర్వాత తన కేబినెట్‌ను ఎలాగూ పునర్నియమించే అవకాశం ఉన్న నేపథ్యంలో వంశీ వంటి యువ నాయకులకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని, కమ్మ వర్గం తన పార్టీకి చేరువ అవుతుందని కూడా జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ వైసీపీ గూటికి చేరుతున్నారనే మరో బలమైన వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం.