తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ, రేపు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం రోజున హైదరాబాద్, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
మరోవైపు గత మూడ్రోజుల నుంచి హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
శుక్రవారం రోజున హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. వానహోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట, అత్తాపూర్, బండ్లగూడ, మెహదీపట్నం, ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే కార్వాన్, లంగర్‌హౌస్, గోల్కొండ, మల్లేపల్లి , హుస్సేన్‌సాగర్, ప్రాంతాల్లో వాన కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు వర్షం కారణంగా గణనాథుల నిమజ్జనం ఆలస్యం అయింది. రహదారుల పైకి నీరు రావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.. వానలోనే గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు.