హుజూరాబాద్ స్పెషల్: గమనించారా… వికలాంగులు – వృద్ధులే కీలకం!

-

తెలంగాణలో త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక అటు టీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి అత్యంత కీలకమైన ఎన్నికగా మారిన సంగతి తెలిసిందే. కేవలం ఒక ఉప ఎన్నికకోసం వేలకోట్లు ఖర్చయ్యే “దళితబంధు” పథకం పుట్టిందంటేనే ఈ ఉప ఎన్నికను అధికారపార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఉప ఎన్నికలో గెలవకపోతే రాజకీయ సన్యాసమే అనే స్థాయిలో ఈటెల మాట్లాడుతున్నారంటే… ఆయనకు వ్యక్తిగతంగా ఈ ఉప ఎన్నిక ఎంత విలువైందో అర్ధం అవుతుంది. ఈ పరిస్థితుల్లో… ఆ నియోజకవర్గంలో వికలాంగులు – వృద్ధుల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి.

Huzurabad | హుజురాబాద్

అవును… హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్పుడు వృద్ధులు – వికలాంగులే కీలకం. వారు అవునన్నవాడు మంత్రి – కాదన్నవాడు కంత్రి! హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలిచినా… పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉండొచ్చు! ఈ పరిస్థితుల్లో… నేతల తలరాతలు మార్చేది పోస్టల్ బ్యాలెట్లు. ఎందుకంటే… హుజూరాబాద్ లో 12వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి.

ఒకప్పటిలా కాకుండా… ఎన్నికల కమిషన్ అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు కూడా పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకోవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే… హుజూరాబాద్ లో 80 ఏళ్ల పైబడిన వృద్ధులైన ఓటర్లు 4454 మంది ఉండగా… వికలాంగ ఓటర్లు 8139 మంది ఉన్నారు. ఇక వృద్ధులు వికలాంగులతోపాటు పోస్టల్ బ్యాలెట్ ల ద్వారా 147 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే… హుజూరాబాద్ లోని మొత్తం ఓటర్లలో ఇది సుమారు 7శాతం అన్నమాట.

కాబట్టి… హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్పుడు వికలాంగులు – వృద్ధులే గెలుపులో కీలకంగా మారారన్నమాట. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓటుకోసం రాజకీయ పార్టీలు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నాయంట. గెలుపును డిసైడ్ చేసేలా ఈ పోస్టల్ బ్యాలెట్ ఉండడంతో ప్రధాన పార్టీలు అన్నీ దీనిపైనే ఎక్కువగా దృష్టి సారించాయని చెబుతున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Exit mobile version