పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కొడమంచలి శ్రీను, ధనలక్ష్మి దంపతులు చేపల వేట ద్వారా జీవనం సాగిస్తున్నారు. కృష్ణా నది పరివేణి ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు ఏప్రిల్ 19న వారు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం జెండా పెంట గ్రామానికి వచ్చారు. మే 2న నదిలో వేట ముగించుకున్న అనంతరం తిరిగి గ్రామానికి వెళ్లే క్రమంలో వారు దారి తప్పిపోయారు. వెంటనే రాత్రి కమ్ముకోవడం, చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో వారు అటవీ ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. ఆహారం లేకపోవడం, చీకటి మధ్య క్రూరజంతువుల అరుపులు వినిపించడం వల్ల తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ధనలక్ష్మి నలుగురు నెలల గర్భవతిగా ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
తెల్లవారిన అనంతరం 100కు డయల్ చేసిన ధనలక్ష్మి–శ్రీను దంపతుల ఫోన్ లొకేషన్‌ను విశ్లేషించిన వెల్దుర్తి ఎస్ఐ షేక్ సమందర్ వలి, వారి స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించారు. కొత్తపుల్లారెడ్డిగూడెం అటవీ ప్రాంతంలోని లోతైన అడవిలో వారు చిక్కుకుపోయినట్లు నిర్ధారణయ్యింది. వెంటనే ముగ్గురు కానిస్టేబుళ్లతో కలసి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, మరో 6 కిలోమీటర్ల మేర నడిచి, జంటను సురక్షితంగా వెలికితీశారు. రాత్రంతా భయం, ఆకలితో అలమటించిన జంటను గుర్తించిన పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు. “క్రూరజంతువుల అరుపులు రాత్రంతా వినిపించాయి… బతికేం లేదా అన్న భయం వేధించింది. చివరకు పోలీసులు వచ్చి చీకటి నుంచి వెలుతురులోకి తీసుకువచ్చారు,” అని ధనలక్ష్మి కంటతడి పెట్టారు.