ప్రియాంకా చోప్రా ఒక్క ఇన్‌స్టాగ్రాం పోస్టుకు రూ.1.87 కోట్లు తీసుకుంటోందట. ఈమెకు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కలిపి 43 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ జాబితాలో ప్రియాంకా చోప్రా 19వ స్థానంలో ఉంది.
ఇండియన్ సెలబ్రిటీలు ఒకప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు చాలా మంది ఇన్‌స్టాగ్రాంను వాడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వైపు ఇన్‌స్టాగ్రాం ద్వారా వారు తమ అభిమానులకు దగ్గరగా ఉంటూనే.. మరోవైపు ఒక్క పోస్టుకు కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తున్నారు. హాపర్ హెచ్‌క్యూ అనే ఓ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కంపెనీ విడుదల చేసిన 2019 ఇన్‌స్టాగ్రాం రిచ్ లిస్ట్ ప్రకారం.. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఇండియన్ క్రికెట్ టీం కెప్లెన్ విరాట్ కోహ్లిలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం ద్వారా అత్యధికంగా డబ్బులు సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ టీవీ నటి కైలీ జెన్నర్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పెట్టే ఒక్క పోస్టుకు 1.266 మిలియన్ అమెరికన్ డాలర్ల (దాదాపుగా రూ.8.47 కోట్లు) ను సంపాదిస్తోందట. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం రిచ్ లిస్ట్ 2019 జాబితాలో ఈమే మొదటి స్థానంలో ఉంది. ఇక ఆ తరువాతి స్థానంలో సింగర్ ఏరియానా గ్రాండె ఉంది. ఆమె ఒక్క పోస్టుకు 9.96 లక్షల డాలర్లు (దాదాపుగా రూ.6.87 కోట్లు) వసూలు చేస్తోందట. అలాగే ప్రియాంకా చోప్రా ఒక్క ఇన్‌స్టాగ్రాం పోస్టుకు రూ.1.87 కోట్లు తీసుకుంటోందట. ఈమెకు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కలిపి 43 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ జాబితాలో ప్రియాంకా చోప్రా 19వ స్థానంలో ఉంది. ఆ తరువాత 23వ స్థానంలో కోహ్లి ఉన్నాడు. ఇతను ఒక్క ఇన్‌స్టాగ్రాం పోస్టుకు రూ.1.35 కోట్లు తీసుకుంటున్నాడు.
ఇక ఇన్‌స్టాగ్రాం రిచ్ లిస్ట్ 2019 లో పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో కూడా ఉన్నాడు. ఇతను ఒక్క ఇన్‌స్టాగ్రాం పోస్టుకు రూ.6.73 కోట్లు తీసుకుంటుండగా, అమెరికన్ నటి కిమ్ కార్దాశియన్ ఒక్క పోస్టుకు రూ.6.28 కోట్లను అడ్వర్టయిజర్ల నుంచి వసూలు చేస్తోంది. అలాగే సింగర్ సెలీనా గోమెజ్ (రూ.6.11 కోట్లు), సింగర్ జస్టిన్ బీబర్ (రూ.4.98 కోట్లు)లు కూడా ఈ రిచ్ లిస్ట్‌లో ఉన్నారు. వీరంతా తమ తమ ఇన్‌స్టాగ్రాం ఖాతాలలో అడ్వర్టయిజర్లు ఇచ్చే ప్రకటనలకు సంబంధించి పెట్టే ఒక్క పోస్టుకు మాత్రమే ఆ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. సెలబ్రిటీలు అంటే.. ఒకప్పటిలా కాదు.. ఇప్పుడు దాదాపుగా అన్ని రకాలుగా వారికి ఆదాయం లభిస్తుందన్నమాట..!