పవర్ స్టార్​ డైహార్డ్ ఫ్యాన్​ నేను.. కానీ ఆయనతో నటించను : ప్రియాంక జవాల్కర్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆపేరులోనే ఓ వైబ్రేషన్ ఉంటుంది. పవర్ స్టార్ అనే పేరు చాలు.. బాక్సాఫీస్​ను బద్ధలు కొట్టడానికి. పవన్ కల్యాణ్ తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మనసు నిండిపోతుంది. ఆయనతో నటించాలని తోటి నటులు తపిస్తుంటారు. ఇక హీరోయిన్లయితే తమ కెరీర్​లో ఒక్కసారైనా పవర్ స్టార్​ పక్కన కనిపించాలనుకుంటారు. కానీ ఓ టాలీవుడ్ హీరోయిన్.. అదీ తెలుగమ్మాయి.. మాత్రం పవన్ కల్యాణ్ పక్కన మాత్రం అసలు నటించనని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. అందరూ మెచ్చే హీరో పక్కన ఆమె నటించను అనడానికి కారణమేంటి..? అసలు ఎవరా హీరోయిన్​.. తెలుసుకుందామా..?

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సరసన ట్యాక్సీవాలా సినిమాలో నటించి క్రేజ్‌ను సొంతం చేసుకుంది ప్రియాంక జవాల్కర్‌. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి అలరించింది. ఈ అమ్మడుకి పవన్‌ కల్యాణ్‌ అంటే ఎంత ఇష్టమో సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన అభిమాన హీరో గురించి తెలిపింది. పవన్‌ కల్యాణ్‌ అంటే చచ్చేంత ఇష్టమని చెప్పింది. ఆయన నటించిన తమ్ముడు సినిమా 20 సార్లు చూసిందిట. అలాగే ఖుషి సినిమాలోని అన్ని డైలాగులు అలవోకగా చెప్పేస్తానని అంటోంది.

“అంతపెద్ద స్టార్‌ అయినా కూడా అంత సింపుల్‌గా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. ఆయన్ని దూరం నుంచి చూస్తూ అభిమానిస్తాను కానీ, ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినా నేను దానికి అంగీకరించను. ఆయనతో కలిసి సినిమా మాత్రం చేయలేను. ఇలా దూరం నుంచి చూస్తూ.. ఎప్పటికీ ఆయన్ని అభిమానిస్తూ ఉండిపోతా. ఈ జీవితానికి అది తప్ప మరొకటి అవసరం లేదు” అని చెప్పింది.

ఇక షార్ట్‌ ఫిల్మ్‌తో తన కెరీర్‌ ప్రారంభించిన ప్రియాంక విజయ్‌ సరసన నటించిన సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత తిమ్మరుసు, ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం, గమనం వంటి సినిమాల్లో కనిపించింది. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఇన్​స్టాగ్రామ్​లో 1.4 మిలియన్​ ఫాలోయర్స్‌ ఉన్నారు. 2017లో తెలుగులో వచ్చిన ‘కల వరం ఆయే’ సినిమా ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version