టీచర్లకు కేసీఆర్ సర్కార్ తీపికబురు చెప్పింది. వారికి ఏడున్నర సంవత్సరాల తర్వాత పదోన్నతులు, నాలుగున్నర ఏళ్ల అనంతరం బదిలీలు కల్పించేందుకు పచ్చ జెండా ఊపింది. ఈనెల 18 లేదా 19 తేదీల్లో అందుకు సంబంధించిన కాల పట్టికను జారీ చేయనుంది.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్వగృహంలో ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన తదితరులు ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలతో సమావేశం అయ్యారు.
మంత్రి సబితా మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్న శుభవార్త చెప్పేందుకే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యామన్నా రు. త్వరలోనే తొమ్మిది వేల మందికి పైగా పదోన్నతులు దక్కుతాయని, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా ప్రక్రియ చేపడతామని చెప్పారు.