స్త్రీలను గౌరవించి.. పెద్ద పీఠ వేసే భారతదేశంలోనే మహిళలు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. కాదంటే కిరోసిన్ పోయటం.. లేదంటే కత్తితో పోడవటం.. మనిషి అనే విషయాన్ని మరిచి మృగాల్లా ప్రవర్తించే కామాంధులు అడుగడుగునా ఎదురవుతూనే ఉన్నారు. తాజాగా దేశంలో నిన్న ఒక్కరోజే వెలుగులోకే వచ్చిన అఘాయిత్యాలు ఆడపిల్లలకు రక్షణ ఏమాత్రం ఉందో అర్థమవుతోంది.
కిరోసిన్ పోసి..
లఖ్‌నవూ-బరేలీ జాతీయ రహదారి పక్కన అచేతనావస్థలో నగ్నంగా కనిపించిన దిగ్భ్రాంతికర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో సోమవారం చోటుచేసుకుంది. రాయ్ ఖెడా గ్రామం సమీపంలో సోమవారం ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి 72 శాతం కాలిన గాయాలయ్యాయని ఆసుపత్రి డైరెక్టర్ ఎస్సీ సౌంద్రియాల్ వెల్లడించారు.
కాదన్నందుకు కత్తిపోట్లు..
గోండా జిల్లాలో కామాంధులు.. పాఠశాల నుంచి సైకిల్‌పై వచ్చే ఓ బాలికపై అత్యాచారం చేసి అనంతరం కత్తితో పొడిచారు. ఈ ఘటనకు సంబంధించి ఖండేరు అనే వ్యక్తి, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసు సూపరింటెండెంట్ శైలేశ్‌కుమార్ పాండే తెలిపారు.
14ఏళ్ల యువతికి డ్రగ్స్ ఇచ్చి..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన స్నేహం ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఏడుగురు వ్యక్తులు 14 ఏళ్ల బాలికకు మాదకద్రవ్యాలు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలో 11 ఏళ్ల బాలికపై ఆమె బంధువు ఒకరు సోమవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో చోట హమీర్పుర్ పట్టణంలో రెండు రోజుల క్రితం ఐదుగురు వ్యక్తులు 17 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి బుధవారం మృతి చెందింది. మహోబా జిల్లాలో ఓ దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి రోహిత్ యాదవ్, కులు రాజ్‌పుత్ అనే వ్యక్తులను మంగళవారం అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోట అనూష అనే యువతికి, బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి కొన్నాళ్లుగా పరిచయం ఉంది. ఈమధ్య అనూష మరో అబ్బాయితో మాట్లాడుతుండటంతో తట్టుకోలేక విష్ణువర్ధన్‌రెడ్డి అనూషతో గొడవపడి చివరికి ఆమె ప్రాణాలను తీశాడు.