ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. ఒకే రోజు నిర్వహించిన రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్‌కు దారి తీశాయి. మధ్యాహ్నం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ల మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీయగా, అందులో కోల్‌కతా విజయం సాధించింది. ఇక సాయంత్రం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా సూపర్ ఓవర్‌కు వెళ్లింది. కానీ మొదటి సూపర్ ఓవర్ కూడా టై అవడంతో రెండో సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. దాంట్లో పంజాబ్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ జట్టు ముంబైపై గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో క్వింటన్ డికాక్, కృనాల్ పాండ్యా, కిరణ్ పొల్లార్డ్‌లు రాణించారు. 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో డికాక్ 53 పరుగులు చేయగా, కృనాల్ పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 34 పరుగులు చేశాడు. కిరణ్ పొల్లార్డ్ 12 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లు చెరో 2 వికెట్లు తీయగా, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్‌లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో రాహుల్ 77 పరుగులు చేశాడు. అలాగే గేల్ (24 పరుగులు, 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా ఆకట్టుకున్నాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా, చాహర్ 2 వికెట్లు తీశాడు.
ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. అందులో రెండు జట్లూ మళ్లీ సమాన స్కోర్లు చేశాయి. ఇరు జట్లు 5 పరుగుల చొప్పున చేశాయి. దీంతో మళ్లీ సూపర్ ఓవర్‌ను నిర్వహించగా ముంబై 11 పరుగులు చేసింది. తరువాత పంజాబ్ ఆ స్కోరును ఛేదించింది. 4 బంతుల్లోనే 15 పరుగులు చేసి మ్యాచ్‌లో గెలుపొందింది.