ప్యూర్ ఈవీ స్టార్టప్ కొత్తగా ప్యూర్ ఇట్రాన్స్ ప్లస్ పేరిట ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రకారం దీని ధర రూ.56,999గా ఉంది. ఇప్పటికే ప్యూర్ ఈవీ కంపెనీ ప్యూర్ ఇప్లూటో, ఇప్లూటో 7జి, ఇట్రాన్స్, ఇగ్నైట్, ట్రాన్‌ప్లస్ పేరిట 5 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయగా.. తాజాగా విడుదల చేసిన వాహనం 6వది కావడం విశేషం. ఈ వాహనాన్ని రెడ్, బ్లూ, మ్యాట్ బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. కాగా ప్యూర్ ఈవీ స్టార్టప్ ఐఐటీ హైదరాబాద్‌కు చెందినది కావడం విశేషం.
స్కూటర్ లాంచింగ్ సందర్భంగా ప్యూర్ ఎనర్జీ సీఈవో రోహిత్ వడెరా మాట్లాడుతూ.. దేశంలో నిత్యం కాలుష్యం పెరిగిపోతున్నందున ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారన్నారు. రోజూ పరిమిత దూరం ప్రయాణించే వారికి ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. భారత్‌లోని రోడ్లను, ప్రజల ఇష్టాలను పరిగణనలోకి తీసుకుని ప్యూర్ ఇట్రాన్స్ ప్లస్ స్కూటర్‌ను రూపొందించామని తెలిపారు. నిత్యం తక్కువ దూరం ప్రయాణించేవారికి ఈ స్కూటర్ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్యూర్ ఇట్రాన్స్ ప్లస్ స్కూటర్‌లో 250 వాట్ల మోటార్‌ను అమర్చారు. ఈ స్కూటర్‌పై గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఇందులో పోర్టబుల్ బ్యాటరీని అందిస్తున్నారు. అందువల్ల దీన్ని ఎక్కడైనా సులభంగా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ స్కూటర్‌కు ఎల్ఈడీ లైట్స్, 10 ఇంచుల అలాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఇదే స్కూటర్‌కు గాను ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే మరో మోడల్‌ను డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ఆ స్కూటర్ గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఒక్కసారి బ్యాటరీని ఫుల్ చార్జింగ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు తిరగవచ్చు. దాని ధర రూ.69,999గా ఉండనుంది.