ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు

-

ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. ఆ దేశంపై అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఉక్రెయిన్‌ సమస్య ఉత్పన్నమైందని అన్నారు. ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ విధాన నిపుణుల సమావేశంలో పుతిన్‌ మాట్లాడారు.

‘‘ఉక్రెయిన్‌పై మాస్కో అణుదాడి చేస్తుందన్న ఆలోచన అర్థరహితం. రాజకీయంగా, సైనిక పరంగా అంతటి చర్యకు దిగాల్సిన అవసరమే లేదు. మానవాళి ముందు ఇప్పుడు రెండే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి.. అందరికీ చేటుచేసే సమస్యలను కొనితెచ్చుకోవడం. రెండు.. ఆదర్శవంతమైనవి కాకపోయినా ప్రపంచం స్థిరంగా, భద్రంగా కొనసాగేందుకు దోహదపడే పరిష్కారాలను కనుగొనడం. పశ్చిమ దేశాలకు రష్యా శత్రువేమీ కాదు. కానీ, మా దేశాన్ని లొంగదీసుకునేందుకు అవి ప్రదర్శిస్తున్న నియంతృత్వ పోకడలు, విధానాలను మాత్రం వ్యతిరేకిస్తాం. ఎప్పటికీ ఆ ప్రయత్నాలు విజయవంతం కావు. సోవియట్‌ హయాంలో, కమ్యూనిస్ట్‌ నేతల ద్వారా రష్యా భూభాగాలను అందుకుని.. ఉక్రెయిన్‌ కృత్రిమ దేశంగా అవతరించింది. మా రెండు దేశాల ప్రజలు ఒకే జాతికి చెందినవారు’’ అని పుతిన్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version