సింధు కలెక్షన్‌లో స్వర్ణం పతకం చేరింది.. శుభాకాంక్షలు : కేటీఆర్‌

-

కామన్వెల్త్‌ గేమ్స్‌లో చివరి రోజు భారత్‌పై పతకాల వర్షం కురిసింది. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణ పతకం పట్టేసింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో కెనడాకు చెందిన మిషెల్లే లిని ఓడించిన సింధు.. పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ కేటీఆర్.. ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘భారత అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీవీ సింధుకు.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం గెలిచి తన కలెక్షన్‌లో ఈ పతకం కూడా చేర్చుకున్న సందర్భంగా శుభాకాంక్షలు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు సింధు ఖాతాలో కామన్‌వెల్త్ స్వర్ణం లేదు. 2014లో కాంస్యంతో సరిపెట్టుకున్న ఆమె.. 2018లో సిల్వర్ మెడల్ సాధించింది. అయితే ఈసారి మరింత పట్టుదలగా ఆడి పసిడిని ముద్దాడింది. అంతకుముందు కామన్‌వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ ఆచంట, శ్రీజ ఆకుల జోడీ అద్భుతమైన ప్రదర్శన చేసింది.

టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఫైనల్‌లో మలేషియాకు చెందిన జావెన్ చూంగ్, కారెన్ లైన్‌ను ఓడించి స్వర్ణం గెలిచిన ఈ జోడీని.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘‘కామన్‌వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన శరత్ కమల్, శ్రీజకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మేమంతా గర్వించేలా చేశారు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కూడా శరత్ కమల్ సత్తాచాటుతున్నాడు. సెమీస్‌లో విజయం సాధించి ఫైనల్ చేరాడు. సోమవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో శరత్.. ఇంగ్లండ్‌కు చెందిన లియామ్ పిచ్‌ఫోర్డ్‌తో తలపడనున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version