1,80,000 కోట్ల బకాయిలను జగన్ సర్కార్‌ చెల్లించాల్సి ఉంది – వైసీపీ ఎంపీ

-

గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులెంత?, టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులెన్ని??, అనే దానిపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేస్తే దాచుకున్నది ఎవరో?, దోచుకున్నది ఎవరో?? తెలిసిపోతుందని, గత నాలుగెళ్ళ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరిట, ఇతరాత్ర ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులను చేసిందని, ఇప్పటికీ పనులు చేసిన వారికి 1,80,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు.

తాము చేసిన పనుల బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు రోడెక్కారని, ఒక్క సివిల్ కాంట్రాక్టర్లకే 30 వేల కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, ఇప్పటికే ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. బటన్ నొక్కుడు ద్వారా రెండు లక్షల ఏడు వేల కోట్ల రూపాయల ప్రజలకు ఇచ్చానని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారని, బటను నొక్కే కార్యక్రమం ద్వారా ఇచ్చినని చెబుతున్న నిధులకు సరి సమానంగా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయంటే ఎవరు దోచుకున్నారో?, దోచుకొని దాచుకున్నారో అర్థం అవుతుందని అన్నారు.

 

తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సి ఎఫ్ ఎం ఎస్ వెబ్ సైట్ ను కాగ్ కు అనుసంధానించాలని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అప్పులెన్నో తెలిసిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని తాను ఎన్నో మార్లు డిమాండ్ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవ్వరు స్పందించిన దాఖలాలు లేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై జీవీ రెడ్డి, తులసి రెడ్డి గార్లు తమ వద్ద ఉన్న వివరాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులెన్ని అని తాను ఒక ప్రజా ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నానని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిలలో ఎవరైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version