కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో సాగుతుంది.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (52) ఎంతో ఉత్సాహంగా యాత్రలో ముందుకు కదులుతున్నారు. ప్రజలతో
మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ముసలివాళ్ల నుంచి పిల్లల వరకూ అందరితో చనువుగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే.. అక్టోబర్ 17న రాహుల్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. 17న జరిగే ఏఐసీసీ ఎన్నికల కోసం బెంగళూరు వెళ్లనున్నారు రాహుల్. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో ఓటు వినియోగించుకోనున్నారు. ఈనెల 17న సాయంత్రం 5గంటలకు ఆంధ్రా-కర్ణాటక బోర్డర్‌లో ఛేత్రగుడిలో రాహుల్ బస చేయనున్నారు.
ఈనెల 18న ఉదయం 6 గంటలకు ఛేత్రగుడి హనుమాన్ దేవాలయం నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. 18 రాత్రికి ఛాగి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రాహుల్‌గాంధీ బస చేస్తారు. 19న ఉదయం ఛాగి నుంచి రాహుల్ భారత్ జోడోయాత్ర ప్రారంభం కానుంది. 19న రాత్రి ఎమ్మిగనూరు చెన్నపురం దగ్గర రాహుల్ బస చేస్తారు. 20న ఎమ్మిగనూరు నుంచి రాహుల్ యాత్ర ప్రారంభమవుతుంది. 20న రాత్రికి మంత్రాలయం శివారులో రాహుల్ బస చేస్తారని, 21న మంత్రాలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించారు. అంతేకాకుండా.. 21న రాత్రికి కర్ణాటకలోని రాయచూర్‌కు చేరుకోనున్న రాహుల్ యాత్ర సాగనుంది. అలాగే అక్టోబర్ 24న తెలంగాణలో రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది.