మాజీ బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందల్‌లు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ముస్లిం దేశాలు నుపుర్, నవీన్‌లు చేసిన వ్యాఖ్యలపై భారత రాయబారులకు నిరసన నోటీసులు ఇచ్చాయి. దీంతో ఈ విషయం కాస్తా దేశం దాటిపోయింది. అయితే దీనిపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు దేశానికి రుద్దకూడదంటూ.. భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు కలిసి ఉన్నాయని, మతాలను విద్వేషించడం భాతర ప్రభుత్వం సహించదని స్పష్టం చేసింది.
అయినప్పటికీ విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు… కానీ భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతోంది. ఇలాంటి సిగ్గుమాలిన మతోన్మాదం మనలను ఏకాకులను చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువును కూడా మంటగలుపుతోంది అని విమర్శించారు రాహుల్ గాంధీ.