ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీకి, ఈడీకి తాను భయపడనని అన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఈడీ బుధవారం సీల్ చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఇవన్నీ బెదిరింపు ప్రయత్నాలు అని అన్నారు రాహుల్ గాంధీ. మోదీ ప్రభుత్వం కోరుకున్నది చేసుకోవచ్చని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటానన్నారు రాహుల్ గాంధీ. సత్యానికి అడ్డుకట్ట వేయలేమని, ఏదైనా చేసుకోండని రాహుల్ గాంధీ అన్నారు. నేను ప్రధానికి భయపడనని, దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తానన్నారు రాహుల్ గాంధీ.
మాపై ఒత్తిడి చేయడం ద్వారా మమ్మల్ని ఆపవచ్చని అనుకుంటున్నారని, మేము మౌనంగా ఉండమని, మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏం చేసినా అడ్డుగా నిలబడతామని రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేయడం దుమారం రేపింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్తావించారు ఖర్గే. కాంగ్రెస్ను భాజపా భయపెట్టాలని చూస్తోందని.. అయితే దీనికి భయపడబోమని అన్నారు.