దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్వేషం పెరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు దేశాన్ని విభజిస్తున్నాయని ఆరోపించారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వర్గం కూడా అభివృద్ధి చెందలేదని దుయ్యబట్టారు. ఎక్కడ చూసిన మతకల్లోలాలు, ఘర్షణలతో దేశం రావణకాష్ఠంలా తయారైందని మండిపడ్డారు.
మరోవైపు.. ధరల పెరుగుదల దేశాన్ని నిండా ముంచేస్తోందని రాహుల్ ఆరోపించారు. ద్రవ్యోల్బణం వల్ల సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ నిరసన కార్యక్రమంలో ప్రసంగించిన రాహుల్.. భాజపా వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు మాత్రమే లాభపడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడిన ఆయన.. దీని ద్వారా ప్రజల్లోకి వెళ్లి నిజాలు చెబుతామని అన్నారు.
‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్వేషం పెరగడం.. వల్ల దేశం బలహీనంగా మారుతోంది. దేశంలో భయం, విద్వేషం నెలకొనడం వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు లాభపడుతున్నారు. వారి ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తోంది’ అని రాహుల్ అన్నారు.