రెండు జాతీయ పార్టీల మధ్య ఫేస్ బుక్ వివాదం ముదురుతోంది. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలని ఫేస్ బుక్ చూసి చూడనట్టు వదిలేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం రోజు రోజుకీ ఇరు పార్టీ మధ్య దుమారాన్ని రేపుతోంది. విద్వేష్ కంటెంట్‌ని నిరోధించేందుకు ఫేస్ బుక్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలంటూ ఫేస్ బుక్ ఛీఫ్ జూకర్ బర్గ్‌కి కాంగ్రెస్ లేఖ రాపిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖపై ఇప్పటి వరకు జూకర్ బర్గ్ స్పందించలేదు.
ఇక వాట్సాప్ సంస్థని కూడా బీజేపీ తమ చెప్పుచేతల్లో పెట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్ బుక్ ఉద్దేశ పూర్వకంగానే బీజేపీతో కుమ్మక్కయిందని, ఇప్పటికీ దద్దుబాటు చర్యలకు అవకాశం వుందని జూకర్ బర్గ్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్ వర్గాలు ఘాటు విమర్శలు చేశాయి. తాజాగా టైమ్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ప్రత్యేక కథనాన్ని షేర్ చేస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఫేస్ బుక్‌పై మరింత దుమారాన్ని రేపుతున్నాయి.
వాట్సాప్, బీజేపీ మధ్య వున్న సంబంధాన్ని కూడా టైమ్స్ మ్యాగజైన్ ఈ కథనంలో వివరించిందని రాహుల్ ఈ సందర్భంగా వెల్లడించారు. మోడీతో కలిసి జైకర్ బర్గ్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోని కూడా షేర్ చేసిన రాహుల్ బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాలని మీరు పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణకు మీరు పూనుకుంటారా? అని ఈ సందర్భంగా జూకర్ బర్గ్‌ని రాహుల్ ప్రశ్నించారు. ఫేస్ బుక్ ఇండియా , పాలక బీజేపీ మధ్య ఇది నీకు.. ఇది నాకు అనే స్థాయిలో వ్యవహారం సాగుతోందని రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.