తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అందు కోసం స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని గత కొద్ది రోజుల నుంచి టీపీసీసీ నేతలు చెబుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన తేదీలు ఖరారు అయినట్టు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాస్కీ గౌడ్ ప్రకటించారు.మే 6, 7 తేదీల్లో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చిందని ఆయన తెలిపారు.
మే 6 వ తేదీన సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోయే.. రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ హాజరు అవుతున్నట్టు తెలిపారు. ఈ బహిరంగ సభ.. తెలంగాణ రాష్ట్రంలోని రైతు సమస్యలపై నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే మే 7వ తేదీన హైదరాబాద్ నగరంలో టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ కీలక సమావేశం కానున్నారని తెలిపారు.