కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అడుగడుగునా విమర్శలు ఎదుర్కొంటోంది. ఓ వైపు కాంగ్రెస్.. తమ పార్టీకి వస్తోన్న మద్దతు చూసి ఓర్వలేక కొందరు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేస్తోంది. మరోవైపు బీజేపీ.. అడుగడుగునా జోడో యాత్రపై విమర్శలు ఎక్కు పెడుతూ వస్తోంది. తాజాగా జోడో యాత్రలో రాహుల్ చేసిన పనికి నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.
కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ కేరళలో పర్యటిస్తున్నారు. ప్రజలను పలకరిస్తూ.. పాదయాత్రను సాగిస్తున్నారు. మార్గం మధ్యలో పిల్లలతో కలిసి రాహుల్ ఫుట్ బాల్ ఆడారు. ఉదా రంగు దుస్తులు ధరించి కొందరు బాలురు రాహుల్‌తో సాగుతూ.. ఫుట్‌బాల్ ఆడారు. ఆయన కూడా బంతి విసిరి వారిని ఉత్సాహపరిచారు.
ఈ వీడియోను కాంగ్రెస్ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి. అందుకోసం ప్రతి అడ్డంకిని ఎదుర్కోవాలి’ అని వ్యాఖ్యను జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్ సంక్షోభ వేళ.. వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యాలపై నెటిజన్లు విమర్శనాత్మకంగా స్పందిస్తున్నారు.
ये भविष्य ही तो संवारना है और इनके लिए हर मुश्किल से टकरा जाना है।#BharatJodoYatra pic.twitter.com/24R5Jvm9gY
— Congress (@INCIndia) September 26, 2022