తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణలో సెప్టెంబరు 1 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని ఐఎండీ వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయని, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ మేరకు పెద్దపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అయితే, వాతావరణ శాఖ హెచ్చరించినట్లే.. హైదరాబాద్ లో వర్షం పడుతుంది. ఆగస్ట్ 25, 26 తేదీల్లో ఉరుములు, మెరుపులతో వర్ష సూచన ఉన్నట్లు ముందే ప్రకటించింది. అనుకున్నట్లుగానే 2023, ఆగస్ట్ 26వ తేదీ శనివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఉక్కబోత, ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతంగా మారింది. మోస్తరు వర్షం పడుతుంది. హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నల్లగండ్ల, గచ్చిబౌలి, మదాపూర్, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది. 10 రోజులుగా హైదరాబాద్ సిటీలో వర్షం లేదు. ఇప్పుడు మళ్లీ వర్షం మొదలైంది. మోస్తరు వర్షంతోపాటు కూల్ వెదర్ ను.. వీకెండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు జనం.