బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా గుజరాత్‌లోని కచ్ వరకు ఉపరిత ద్రోణి ఆవరించింది. అటు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలంగాణలో ఇవాళ, రేపు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు తగ్గాయి. ఫలితంగా వాతావరణం బాగా చల్లబడింది. గాలిలో తేమ పెరిగింది. కాగా రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్ల రాజన్న జిల్లా పెద్దూరులో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు ఏపీలో ఈ నెల 22 వరకూ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.