ఏపీకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న దక్షిణ అండమాన్లో ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశలో కుదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రోజున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని అంచానా వేసింది. ప్రస్తుతం అల్పపీడనం చెన్నైకి 400 కిలొమీటర్ల దూరంలో ఏర్పడే అవకాశం ఉంది.
అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో పాటు ఉత్తర తమిళనాడుపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచానా వేశారు. ఇదే విధంగా ఈనెల 11,12 తేదీల్లో నెల్లూరు, చిత్తూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.