దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో లాక్ డౌన్ పాత్ర చాలా కీలకమని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆయన శనివారం ఉదయం ఒక ప్రముఖ టీవీ ఛానల్ లైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎడిటింగ్ పూర్తి అయింది అని వర్క్ కొనసాగుతుందని ఆయన వివరించారు. సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామని అన్నారు.
ఇక ఈ సందర్భంగా మన దేశం గొప్ప తనాన్ని ఆయన వివరించారు. అసలు రూల్స్ పాటించని దేశం, పేదరికం ఉండే దేశం ఇలా ఇంటికే పరిమితం కావడం నిజంగా వండర్ అని కొనియాడారు. లాక్ డౌన్ ని దశల వారీగా ఎత్తివేయాలని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహకాలు చెయ్యాలని ఆయన సూచించారు. కరోనా విషయంలో మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుందని ప్రజలకు వాస్తవాలు చెప్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కొన్ని కొన్ని పదాలతో మీడియా ప్రజలకు కరోనా తీవ్రతను చెప్పిందని… కొన్ని పదాలను ఆయన ప్రస్తావించారు. ఇంత మంది చనిపోతున్నారు, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి అంటూ పదాలతో వాస్తవాలను చెప్తుందని ఆయన అభినందించారు. ప్రజలను భయ౦ నుంచి జాగ్రత్తల వరకు మీడియా తీసుకుని రావాలని ఆయన అన్నారు. కరోనా అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని ఆయన అన్నారు.
రాబోయే మూడు నాలుగు నెలల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఆలోచిస్తే తనకు భయం వేసిందని చెప్పుకొచ్చారు. ఒక్కరికి సోకితే అది పెద్ద ప్రమాదం కాదని ఎక్కువ మందికి అది సోకితే ప్రమాదమని ఆయన అన్నారు. తద్వారా వచ్చే సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. కరోనా కంటే ప్రభుత్వాలు ఫెయిల్ అయితే అది చాలా ప్రమాదకరమని జక్కన్న అభిప్రాయపడ్డారు.