రాజకీయ పార్టీపై యూటర్న్ తీసుకున్న రజనీకాంత్‌పై ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. అనారోగ్యం నుంచి కోలుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సూపర్ స్టార్‌పై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిరోజులు విశ్రాంతి కోసం రజనీని అమెరికాకు తీసుకెళ్లాలని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
పొలిటికల్ ఎంట్రీపై వెనక్కి తగ్గినప్పటి నుంచి రజనీకాంత్‌పై అభిమానుల నుంచి, ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అందుకే కొద్దిరోజులపాటు ఆయనను ఇతర దేశాలకు తీసుకెళ్లడం ఉత్తమమని కుటుంబీకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం…
అన్నాత్తే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో పాటు రజినీ సైతం తీవ్ర రక్తపోటుతో అనారోగ్యం పాలయ్యారు. దాంతో హైదరాబాద్‌లోనే ఆసుపత్రిలో చేరిన రజినీకి పూర్తిగా విశ్రాంతి అవసరమని, పది రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదని వైద్యులు హెచ్చరించారు. దీంతో గతనెల 31న పార్టీని ప్రకటించాలనుకున్న రజినీ.. వైద్యుల సూచనలతో దానిని విరమించుకున్నారు.
రాజకీయ జీవితం ప్రారంభించకుండానే పక్కకు తప్పుకున్నారు. దీనిని రజనీ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగుతున్నారు. వీటన్నింటితో రజనీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. అందుకే కొద్దిరోజులపాటు వీటన్నింటికీ దూరంగా రజనీని అమెరికాకు తీసుకెళ్లాలని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు..