వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనకు సంబంధించి కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో గత నెలలో చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మరొక దేశ నాయకుడు మాట్లాడకూడదని అన్నారు. “మొదట, భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి వ్యాఖ్యానించకూడదని నేను ఆ దేశ ప్రధానమంత్రికి చెప్పాలనుకుంటున్నాను అన్నారు.
భారతదేశానికి బయటి జోక్యం అవసరం లేదు. మేము సమస్యలను స్వయంగా పరిష్కరించుకుంటాము. ఇది అంతర్గత విషయం. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి వ్యాఖ్యానించడానికి ప్రపంచంలో ఏ దేశానికి హక్కు లేదు “అని రాజనాథ్ సింగ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. ఎవరి గురించి ఎవరైనా ఏదైనా చెప్పగలరని పేర్కొన్నారు. కొన్ని దేశాలలో భారత్ లో జరుగుతున్న రైతుల నిరసన పై విమర్శలు వచ్చాయి.
“మా రైతు సోదరులను” తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, అదే జరుగుతోందని ఆయన అన్నారు. మూడు చట్టాలపై ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన రైతులను కోరారు. వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదని స్పష్టం చేసారు. ఇక భారత్ లో నిరసనకు అన్ని దేశాల్లో ఉన్న భారతీయుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్న సంగతి తెలిసిందే.