ప్రధాని పర్యటన వేళ.. మొరాయిస్తున్న ఎరువుల కర్మాగారం

-

రాష్ట్రంలో ప్రధాని పర్యటన కొన్నిగంటల్లో ప్రారంభం కానుంది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు మోదీ వస్తున్నారు. మోదీ పర్యటన వేళ ఎరువుల కర్మాగారంలో సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. తరచూ అవరోధాలు ఏర్పడుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కర్మాగారంలో వార్షిక మరమ్మతుల కోసం సెప్టెంబరు 7న ఉత్పత్తి నిలిపివేసి పనులు మొదలుపెట్టారు.

25 రోజుల్లో మరమ్మతులు పూర్తికావాల్సి ఉండగా రెండు నెలలకుపైగా పట్టింది. ఎట్టకేలకు కర్మాగారాన్ని ఉత్పత్తి దశలోకి ప్రవేశపెట్టగానే.. యూరియా ప్లాంట్‌ పైపులైన్లలో అంతరాయం ఏర్పడటంతో వెంటనే ఉత్పత్తి నిలిచిపోయింది. ఈనెల 9న యూరియా ప్లాంట్‌కు లిక్విడ్‌ అమ్మోనియాను సరఫరా చేసే పైపులైన్‌లో లీకేజీ ఏర్పడింది.

ప్రధాని పర్యటన నేపథ్యంలో.. సామర్థ్యాన్ని తగ్గించి యూరియా ఉత్పత్తి చేస్తూనే.. లీకేజీకి మరమ్మతులు చేపట్టాలనే అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. యూరియా ఉత్పత్తిని నిలిపివేయడంతోపాటు అమ్మోనియా ఉత్పత్తిని సగానికి తగ్గించారు. అమ్మోనియా పైపులైను లీకేజీ సమస్య పరిష్కారం కావాలంటే ప్రత్యేకంగా పైపును తయారు చేయించి బిగించాల్సి ఉండటంతో, ఆ పనిని ఓ గుత్తేదారు ద్వారా చేయిస్తున్నట్లు సమాచారం.

పైపులైను బిగించాక యూరియా ఉత్పత్తి అయ్యేందుకు సుమారు 6గంటల సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రధాని పర్యటన సమయానికి ఉత్పత్తి మొదలుకావడం అనుమానమేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి అమ్మోనియా ప్లాంట్‌ను మాత్రమే చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version