విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముల వారి విగ్రహం ధ్వంసం ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక రకంగా రామతీర్థంలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా శిబిరాలు ఏర్పాటు చేశాయి. ఇప్పటికే టిడిపి, బిజెపి వేరువేరుగా శిబిరాలు ఏర్పాటు చేయగా వారికి పోటీగా మరో శిబిరం ఏర్పాటు చేసేందుకు అధికార వైసిపి కూడా సిద్ధమవుతోంది. ఈరోజు విగ్రహం ధ్వంసం ప్రదేశాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు, అలాగే బిజెపి దీక్ష చేస్తున్న శిబిరాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా పరిశీలించనున్నారు.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ఆ ప్రదేశాన్ని పరిశీలించినున్నట్లు సమాచారం. అయితే నిన్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటన వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. అన్నట్టుగానే కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కాసేపట్లో విజయనగరంలో ఎస్పీ రాజకుమారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.